Sachin Tendulkar: తొలిసారి సచిన్ ఏడవడం చూశా: గంగూలీ

  • 1997లో వెస్టిండీస్‌ పర్యటనలో కెప్టెన్‌గా ఉన్న సచిన్‌
  • టెస్టు మ్యాచ్‌లో ఓటమి జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న మాస్టర్
  • ఈ కోపాన్ని తనపై చూపించాడని గుర్తుచేసుకున్న సౌరవ్
Sourav ganguly says he saw  first time Sachin Tendulkar cry in the dressing room

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ ఆటతోనే కాకుండా.. మంచి వ్యక్తిత్వంతో కూడా అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో మైదానం లోపల, బయట అతను ఎప్పుడూ సహనం కోల్పోలేదు. ఎవ్వరిపైనా నోరు పారేసుకున్న దాఖలాలు లేవు. కానీ, ఓ సందర్భంలో తన సహచరుడు, భారత మాజీ  కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీపై సచిన్ బాగా కోప్పడ్డాడు. ఈ విషయాన్ని గంగూలీనే స్వయంగా వెల్లడించాడు.

1997లో వెస్టిండీస్ పర్యటనలో ఇది జరిగిందని సౌరవ్ చెప్పాడు. నాడు భారత టీమ్‌కు సచిన్‌ కెప్టెన్‌ గా ఉన్నాడు. ఆ పర్యటనలో భాగంగా జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌ 0-1 తేడాతో ఓడిపోయింది. మూడో టెస్టులో కేవలం 120 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయిన జట్టు 81 పరుగులకే కుప్పకూలింది. దీంతో వెస్టిండీస్‌ గడ్డపై 11 ఏళ్ల టెస్టు సిరీస్‌ గెలిచే సువర్ణావకాశం చేజారింది.

ఈ బాధతో కెప్టెన్‌ సచిన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చి విలపించాడని గంగూలీ చెప్పాడు. తొలిసారి సచిన్‌ ఏడవడం చూశానన్నాడు. అంతేకాదు.. జట్టు ఓడిపోయిన కోపాన్ని సచిన్‌ తనపై చూపించాడని చెప్పాడు. టీమిండియాలో చోటు నిలబెట్టుకోవాలంటే.. మరుసటి రోజు ఉదయం నుంచే రోజూ తనతో పాటు మైదానంలో రన్నింగ్‌ చేయాలని ఆదేశించాడని గుర్తు చేసుకున్నాడు.  

అయినా సచిన్‌ తనపై కోప్పడడంలో తప్పేమీ లేదని గంగూలీ అన్నాడు. కెప్టెన్‌గా అవసరమైనప్పుడు సహచరులను మందలించాల్సి రావడం సహజం అన్నాడు. 2000 సంవత్సరంలో సచిన్‌ నుంచి జట్టు పగ్గాలు స్వీకరించిన తర్వాత తాను కూడా సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పాడు.

More Telugu News