Varla Ramaiah: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయం జగన్ కు నచ్చలేదు: వర్ల రామయ్య

  • కరోనా కారణంగా ఎన్నికలను రమేశ్ వాయిదా వేశారు
  • రమేశ్ నిర్ణయాన్ని ప్రజలు కొనియాడుతున్నారు
  • కరోనాను అరికట్టడంలో జగన్ విఫలమయ్యారు
Jagan not satisfied with Nimmagadda Ramesh decesion

కరోనా కారణంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనతోనే స్థానిక ఎన్నికలను రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వాయిదా వేశారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎన్నికలను వాయిదా వేసే అంశాన్ని ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరంలేదని అన్నారు. ఎన్నికలను వాయిదా వేశారనే కోపంతోనే... ఆయనపై వైసీపీ నేతలు ద్వేషాన్ని పెంచుకున్నారని చెప్పారు. రాజ్యాంగంపై అవగాహన లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మరోవైపు, కరోనా నుంచి తమను కాపాడారంటూ రమేశ్ కుమార్ ను ప్రజలు కొనియాడుతున్నారని వర్ల చెప్పారు. అయితే ఆయన నిర్ణయం జగన్, వైసీపీ నేతలకు మాత్రం నచ్చలేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కంటే... స్థానిక ఎన్నికలపైనే జగన్ కు ఎక్కువ ఆసక్తి ఉందని అన్నారు. కరోనాను అరికట్టడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని చెప్పారు.

More Telugu News