New York: తాను చికిత్స చేసిన కరోనా రోగుల మరణాలు తట్టుకోలేక... వైద్యురాలి ఆత్మహత్య!

  • మన్ ‌హట్టన్‌ న్యూయార్క్‌ అలెన్‌ హాస్పిటల్ డాక్టర్ గా పనిచేస్తున్న బిర్నా
  • రోగులు మరణిస్తుంటే తట్టుకోలేక సూసైడ్
  • చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారని తోటి వైద్యుల కన్నీరు
Lady Doctor Sucide after Corona Patients Died

తన కుమార్తె ఎంతో ఇష్టపడి ఎంచుకున్న వైద్య వృత్తే ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైందంటూ, ఓ మహిళా వైద్యురాలి తండ్రి ఇప్పుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను చికిత్స చేస్తున్న కరోనా రోగులు మరణిస్తూ ఉండటాన్ని తట్టుకోలేక, ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అమెరికాలో కరోనా మహమ్మారి ప్రభావం అత్యధికంగా ఉన్న న్యూయార్క్ లో జరిగింది.

వివరాల్లోకి వెళితే, ఇంట్లో ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నా, రోగుల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండే డాక్టర్ లార్నా ఎం బిర్నా (49), మన్ ‌హట్టన్‌ న్యూయార్క్‌ అలెన్‌ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగం మెడికల్‌ డైరెక్టర్‌ గా పనిచేస్తున్నారు. ఆమె ఎంతో మంది కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించి, చనిపోవడాన్ని బిర్నా తట్టుకోలేకపోయిందని ఆమె తండ్రి ఫిలిప్ వెల్లడించారు.

ఆత్మహత్యకు పాల్పడే ముందు బిర్నా తనతో మాట్లాడిందని గుర్తు చేసుకున్న ఆయన, తనలో ఎటువంటి మానసిక సమస్యలూ లేవని, కరోనా సోకిన రోగులను అంబులెన్స్ లోకి ఎక్కించే ముందే వారు మరణిస్తుంటే తట్టుకోలేకున్నానని చెప్పి భావోద్వేగానికి లోనైందని వెల్లడించారు. కరోనా రోగులను అటెండ్ చేసిన బిర్నాకు కూడా వైరస్ సోకిందని, వైరస్ పై ఎంతో పోరాటం చేసి విజయం సాధించిన ఆమె, తిరిగి విధుల్లోకి చేరిందని తెలిపారు. ఇంతలోనే ఘోరానికి పాల్పడుతుందని ఊహించలేదని వాపోయారు.

లార్నా మృతిని తట్టుకోలేక పోతున్నామని, ఆమె మృతికి గల కారణాలు అంతుపట్టడం లేదని ఆసుపత్రి వైద్యులు 'న్యూయార్క్‌ టైమ్స్'‌కి తెలిపారు. ఆమెలో ఎంతో ప్రతిభ ఉందని, చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. ఆమెను కరోనా పట్టుకున్న సమయంలోనూ, తమకు మెసేజ్ ‌లు చేస్తూ రోగుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకునే వారని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతం అయ్యారు.

More Telugu News