Chiranjeevi: జగన్ వద్ద రాజకీయాల ప్రస్తావన అసలు రాలేదు!: చిరంజీవి

  • జగన్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది
  • ఆ గౌరవాన్ని ఆయన అలాగే ఉంచారు 
  • ఈ వయసులో రాజకీయాల వైపు వెళ్లాలన్న ఆలోచన లేదు
Chiranjeevi response on meeting Jagan

ఆమధ్య ముఖ్యమంత్రి జగన్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లి కలవడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. చిరంజీవి వైసీపీ గూటికి వెళ్లనున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి స్పందించారు. జగన్ ను కలిసినప్పుడు తమ మధ్య రాజకీయపరమైన చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

జగన్ కూడా తన వద్ద రాజకీయాల ప్రస్తావన తీసుకురాలేదని చిరంజీవి చెప్పారు. ఆ గౌరవాన్ని ఆయన అలాగే ఉంచారని తెలిపారు. వైసీపీలోకి తనను ఆహ్వానిస్తారని కూడా తాను భావించడం లేదని చెప్పారు. తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడని... పవన్ మాటే మా అందరి మాట అని... ఇదే విషయాన్ని ఇంతకు ముందే తాను చెప్పానని తెలిపారు. 64 ఏళ్ల వయసులో మళ్లీ రాజకీయాల వైపు వెళ్లాలనే ఆలోచన తనకు లేదని చెప్పారు.

ముందు నుంచి కూడా జగన్ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధం ఉందని చిరంజీవి చెప్పారు. ఆ సాన్నిహిత్యంతోనే జగన్ ను కలిశానని తెలిపారు. జగన్ ప్రమాణస్వీకారానికే వెళ్లాల్సి ఉందని... ఆ సమయంలో కాలు బాగోలేకపోవడంతో వెళ్లలేకపోయానని అన్నారు. ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు.

జగన్ ని కలవడం, వారి ఆతిథ్యాన్ని స్వీకరించడం మరచిపోలేని అనుభూతి అని చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం నచ్చింది కాబట్టే అభినందించానని చెప్పారు. ఎవరు మంచి చేసినా అభినందిస్తానని... దీన్ని రాజకీయం చేయకూడదని అన్నారు.

More Telugu News