Donald Trump: కరోనా ఎఫెక్ట్‌తో అమెరికాలో పడిపోతున్న ట్రంప్‌ గ్రాఫ్

For the first time In US Presidential Poll survey JoeBiden takes lead over Trump
  • డెమోక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌కు పెరుగుతున్న మద్దతు
  • తాజా నేషనల్‌ పోల్‌లో ట్రంప్‌పై 6 పాయింట్ల అధిక్యం
  • డిసెంబర్లో ఇదే పోల్‌లో 3 పాయింట్లతో ట్రంప్‌ ముందంజ
అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి, వేల సంఖ్యలో మరణాలు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పదవికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ఆయన గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ఈ ఏడాది చివర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ప్రధాన పోటీదారుగా భావిస్తున్న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు పెరుగుతోంది.

తాజాగా నిర్వహించిన నేషనల్‌ పోల్‌లో ట్రంప్‌ కంటే బైడెన్‌  ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యం చూపారు. దాంతో, ప్రజలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ‘యూఎస్‌ఏ టుడే- సఫ్లోక్ యూనివర్సిటీ పోల్‌’లో పాల్గొన్న వారిలో 44 శాతం మంది అమెరికా మాజీ ఉపాధ్యక్షుడైన బైడెన్‌కు ఓటు వేశారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ వైపు 38 శాతం మంది మొగ్గు చూపారు. ‘యూఎస్‌ఏ టుడే- సఫ్లోక్‌’  గత డిసెంబర్లో  నిర్వహించిన  పోల్‌లో బైడెన్‌ కంటే ట్రంప్‌ మూడు పాయింట్ల అధిక్యంలో నిలువగా.. నాలుగు నెలల్లోనే కథ రివర్సైంది.

 తాజా సర్వే ప్రకారం మెజారిటీ ప్రజలు  ట్రంప్‌, బైడెన్‌ ఇద్దరినీ బలమైన నాయకులుగా పరిగణించడం లేదని తేలింది. ట్రంప్‌ ‘బలమైన నాయకుడు’ అని 45 శాతం మంది అభిప్రాయపడితే... 52 శాతం మంది కాదన్నారు. అలాగే, బలమైన నాయకుడిగా బైడెన్‌కు 43 శాతం ఓటు వేస్తే.. 47 శాతం మంది వ్యతిరేకంగా ఓటేశారు.

 అదే సమయంలో ‘నాలాంటి ప్రజల గురించి ఈయన పట్టించుకుంటారు’ అనే నమ్మకాన్ని వ్యక్తపరిస్తూ బైడెన్‌కు 57 శాతం మంది మద్దతు తెలపగా...  ఈ విషయంలో ట్రంప్‌కు 39 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, ‘పనులు ఎలా చేయాలో’ ట్రంప్‌కు బాగా తెలుసని 51 శాతం మంది చెబితే,  48 శాతం మంది బైడెన్‌ వైపు మొగ్గు చూపారు.  

కరోనా వైరస్‌ విషయంలో ట్రంప్‌ పనితీరు సరిగ్గా లేదని దేశంలో వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో పలు నేషనల్‌ లెవెల్‌ పోల్స్‌లో బైడెన్‌ ఆధిక్యంలో ఉన్నారు. ‘ది రియల్‌ క్లియర్పాలిటిక్స్‌’ నిర్వహించిన పోల్‌‌లో ట్రంప్ పై  బైడెన్‌ 6.3 పాయింట్ల అధిక్యం సాధించారు.
Donald Trump
USA
presidential
poll
surve
joe biden
lead

More Telugu News