Britain: బ్రిటన్‌లో మరో కలకలం.. కొత్త వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు.. ఆందోళన!

Britain issues alert as possible new coronavirus syndrome emerges in children
  • గత మూడు వారాలుగా అనారోగ్యం బారిన చిన్నారులు
  • కడుపు నొప్పి, గుండెలో వాపు వంటి లక్షణాలు
  • టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వంటి లక్షణాలు
బ్రిటన్‌లోని చిన్నారులు అంతు చిక్కని అనారోగ్యం బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల్లో కడుపు నొప్పి, గుండెలో వాపు లాంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తుండడంతో ప్రత్యేకంగా ఐసీయూల్లో ఉంచి చికిత్స చేయాల్సి వస్తోంది. తొలుత ఈ లక్షణాలు కరోనా వైరస్‌కు సంబంధించినవేనని భావించారు. అయితే, కరోనా సోకని చిన్నారుల్లోనూ ఇవి కనిపిస్తుండడంతో నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) అప్రమత్తమైంది.

ఇక ఇలాంటి లక్షణాలు కనుక పిల్లల్లో కనిపిస్తే వెంటనే ఆసుపత్రుల్లో చేర్చాలని కోరింది. చిన్నారుల్లో ‘టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, రక్త నాళాల్లో వాపు కనిపించే కవాసకీ వ్యాధి లక్షణాలు కూడా కొంచెం బయటపడుతున్నాయని పేర్కొంది. గత మూడు వారాలుగా దేశవ్యాప్తంగా పలువురు చిన్నారులు ఈ లక్షణాలతో ఆసుపత్రులలో చేరుతుండడాన్ని గుర్తించినట్టు ఎన్‌హెచ్ఎస్ పేర్కొంది.

శ్వాస తీసుకోవడం అసాధ్యంగా మారినప్పుడు అందించే ‘ఎక్స్‌ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఈసీఎంవో) చికిత్సను అందించాల్సి వచ్చిందంటే ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చని తెలిపింది. ఇది కరోనా వైరస్‌కు సంబంధించిన సిండ్రోమ్ కానీ, లేదంటే మరోటి అయినా అయి ఉండొచ్చని పేర్కొంది. కాబట్టి చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రుల్లో చేర్చాలని సూచించింది.
Britain
NHS
Corona Virus
Children

More Telugu News