Meghalaya: మే 3 తర్వాతా లాక్‌డౌన్‌ కొనసాగించాలి: మేఘాలయా సీఎం

  • మా రాష్ట్రంలో కొనసాగింపు ఉంటుంది
  • గ్రీన్‌జోన్లు, వైరస్ ప్రభావం లేని జిల్లాల్లో కొన్ని సడలింపులు ఇవ్వాలి
  • మేఘాలయాలో ఈ రోజు  కొన్ని ఆంక్షల ఎత్తివేత
Meghalaya Wants Lockdown To Continue Beyond May 3 says Chief Minister

వచ్చే నెల మూడో  తేదీ తర్వాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని తాము కోరుకుంటున్నట్టు మేఘాలయా ముఖ్యమంత్రి  కాన్‌రాడ్‌ సంగ్మా తెలిపారు. ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న  తర్వాత సంగ్మా ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్ ముగిసిన తర్వాత తమ రాష్ట్రంలోని గ్రీన్‌జోన్లు, వైరస్ ప్రభావం లేని జిల్లాల్లో కొన్ని ఆంక్షలు సడలిస్తామని చెప్పారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నా. మేఘాలయాలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని మేం భావిస్తున్నట్టు వారికి చెప్పాం’ అని సంగ్మా ట్వీట్ చేశారు.

మేఘాలయాలో ఇప్పటిదాకా 12 మందికి కరోనా సోకగా...అందులో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో రెండు జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించింది. కొరియర్ సర్వీసుల ద్వారా నిత్యావసరాల విక్రయం, రవాణాకు అనుమతించింది. అలాగే, రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌, తూర్పు ఖాసి హిల్స్‌ జిల్లా మైలీమ్ బ్లాక్‌ మినహా ఇతర ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ విక్రయాలను కూడా అనుమతిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్‌ఎస్ రావు తెలిపారు.

More Telugu News