Corona Virus: కరోనా వ్యాక్సిన్‌ ను వెయ్యి రూపాయలకే అందిస్తామంటున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌!

Pune company plans to ready 20 to 40m vaccine shots at Rs 1000 dose by Sept Oct
  • 2 నుంచి 4 కోట్ల డోసుల కోసం ప్రణాళిక
  • పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ వెల్లడి
  • వచ్చే నెలలో మనుషులపై ప్రయోగాలు
కరోనా వైరస్‌ కు వ్యాక్సిన్‌  అభివృద్ధి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా పలు సంస్థలు టీకా కోసం శ్రమిస్తున్నాయి. ఇందులో పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ముందున్నది. ఇప్పటికే న్యూమోనియా, డెంగ్యూ వ్యాధులకు వ్యాక్సిన్‌ను కనిపెట్టిన సీరం.. భారత్‌లో అతి తక్కువ ఖర్చుతో కరోనాకు టీకాను అందుబాటులోకి తేవాలని చూస్తోంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలసి పరిశోధన చేస్తున్న ఈ సంస్థ.. రూ. 1000కే ఒక డోస్‌ను అందించాలని భావిస్తోంది. త్వరలోనే  మనుషులపై ప్రయోగాలను ప్రారంభించనున్నట్టు  ఈ నెల 23నే ప్రకటించింది.  

‘మే నుంచి ఇండియాలో ట్రయల్స్‌ ప్రారంభించబోతున్నాం. వందల మంది రోగులపై ప్రయోగాలు చేస్తాం. ట్రయల్స్‌ సక్సెస్‌ అయితే  సెప్టెంబర్- అక్టోబర్ వరకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నాం. లాభాపేక్ష లేకుండా ఇండియాలో ఒక్కో డోసును రూ.1000కే అందుబాటులో ఉంచుతాం. దీని తయారీకి మాకు ఖర్చయ్యేది కూడా అంతే’ అని సీరం సంస్థ సీఈఓ అదార్ సుమరివాలా తెలిపారు.

సెప్టెంబర్ వరకు యూకేలో ట్రయల్స్‌ను పూర్తి చేసి, ఆ వెంటనే ప్రొడక్షన్‌ను ప్రారంభించాలని చూస్తున్నట్టు చెప్పారు. తొలి ఆరు నెలల్లో నెలకు నాలుగు నుంచి ఐదు మిలియన్ల డోసులు ఉత్పత్తి చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. సెప్టెంబర్-అక్టోబర్  వరకు రెండు నుంచి నాలుగు కోట్ల డోసులు సిద్ధం చేయాలన్నది తమ ప్రణాళిక అన్నారు. క్లినికల్ ట్రయల్స్‌ విజయవంతం అయితే ఇండియాతో పాటు వీలైనన్ని ఎక్కువ దేశాలకు వ్యాక్సిన్‌ అందిస్తామని చెప్పారు.
Corona Virus
vaccine
by sept
rs1000
serum

More Telugu News