Nellore District: ఆత్మకూరులో లాక్ డౌన్ 'మద్యం' విచిత్రం... మూడు గంటల్లో 650 సీసాలు తాగేశారట!

  • మార్చి 21 రాత్రి 11 గంటల వరకూ బార్ ఓపెన్
  • 8 నుంచి 11 గంటల మధ్య 650 సీసాల అమ్మకం
  • తనిఖీల్లో నివ్వెరపోయే వాస్తవం వెలుగులోకి
650 Bottles of Liquor Sale in Just 3 Hours

అది నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్. లాక్ డౌన్ కు ముందు అక్కడ రోజుకు సగటున 450 సీసాల మద్యం విక్రయాలు సాగుతూ ఉండేవి. అదేంటోగానీ, జనతాకర్ఫ్యూ విధించడానికి ముందు రోజున, రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్య అక్కడికి వచ్చిన మందుబాబులు ఏకంగా 650 సీసాల మద్యం జుర్రేశారట. ఇది ఏపీ ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి ఆదేశాల మేరకు తనిఖీలు జరిపిన అధికారులు ఇచ్చిన మధ్యంతర నివేదిక.

లాక్ డౌన్ సమయంలో ఈ ప్రాంతంలో క్వార్టర్ సీసాను రూ. 1,500 వరకూ, ఫుల్ బాటిల్ ను రూ. 6 వేల నుంచి రూ. 12 వేల వరకూ అమ్మారన్న ఆరోపణలు వినిపించాయి. ఇందుకు ఎక్సైజ్ అధికారుల అండ కూడా ఉందని విమర్శలు వచ్చాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ మంత్రి ఆదేశాను సారం, అన్ని బార్లలోనూ నిల్వలను, రోజువారీ అమ్మకపు రిజిస్టర్లను తనిఖీ చేయాలని ఆదేశించగా, ఆత్మకూరు బార్ లో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

మార్చి నెలలో 21వ తేదీ ఉదయం ప్రారంభపు నిల్వ వివరాలు మాత్రమే నమోదు చేసిన బార్ లో, దాదాపు రెండు రోజుల అమ్మకాలు, రాత్రి 8 నుంచి బార్ మూసేసేలోపు సాగాయి. ఇదేమని బార్ యజమానిని ప్రశ్నించగా, లాక్ డౌన్ ప్రారంభానికి ముందు రోజు వైన్స్ షాపులు 8 గంటలకే మూతపడగా, తాము 11 వరకూ విక్రయాలు సాగించామని చెప్పారు. బార్ లో కెపాసిటీ పరిశీలిస్తే, 650 మంది కూర్చుని తాగే అవకాశమే లేదు. బార్ నుంచి పార్శిల్ విక్రయాలు అనుమతి లేదు. ఇక మూడు గంటల్లో 650 సీసాలు ఎలా అమ్ముడుపోయాయో దేవుడికే ఎరుక.

More Telugu News