Narendra Modi: కింకర్తవ్యం... అందరు ముఖ్యమంత్రులనూ సలహా కోరనున్న నరేంద్ర మోదీ!

  • మరో వారంలో ముగియనున్న లాక్ డౌన్ 2.0
  • నేడు సీఎంలతో మోదీ వీడియో కాన్ఫెరెన్స్
  • ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం
  • రాష్ట్రాల పరిధిలో లాక్ డౌన్ మినహాయింపులకు చాన్స్
Modi Video Conference with CMs Today

మరో వారం రోజుల్లో లాక్ డౌన్ 2.0 ముగుస్తుంది. మండలం రోజుల పాటు లాక్ డౌన్ ను అమలు చేస్తే, కరోనాను తరిమికొట్టవచ్చన్న ఆలోచనతో తొలుత 21 రోజులు, ఆపై మరో 19 రోజుల లాక్ డౌన్ ను ప్రధాని నరేంద్ర మోదీ తెరపైకి తెచ్చారన్న విషయం తెలిసిందే. ఆ గడువు మే 3తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి దశలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, నేడు ముఖ్యమంత్రులతో జరిపే వీడియో కాన్ఫెరెన్స్ తరువాత నిర్ణయిస్తారని తెలుస్తోంది.

ఈ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫెరెన్స్ ప్రారంభం కానుండగా, మోదీ అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు ఆగిపోయి, కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోయిన వేళ, ఆర్థిక వృద్ధి పాతాళానికి పతనం కాగా, దాన్ని తిరిగి నిలిపేలా కొన్ని కీలక నిర్ణయాలను ఈ దఫా మోదీ ప్రకటిస్తూ, లాక్ డౌన్ నుంచి ఉపశమనాన్ని కలిగించవచ్చని తెలుస్తోంది.

ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి, ప్రజా రవాణాను తిరిగి తెరవడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని కూడా మోదీ వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయని పీఎంఓ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో సీఎంల సలహాలను తొలుత అడిగి తెలుసుకోవాలన్న ఆలోచనతో ఉన్న మోదీ, ఆపై మొత్తం పరిస్థితిని సమీక్షించి, లాక్ డౌన్ ను పొడిగించాలా? లేక సడలింపులు ఇవ్వాలా? అన్న విషయమై తుది నిర్ణయానికి వస్తారని సమాచారం.

More Telugu News