South Korea: కిమ్ బతికే ఉన్నాడు... బలంగా నమ్ముతున్న దక్షిణ కొరియా

  • ఉత్తర కొరియా అధినేతపై ఊహాగానాలు
  • చనిపోయాడని, బ్రెయిన్ డెడ్ అయ్యాడని కథనాలు
  • కిమ్ ఆరోగ్యంగానే ఉన్నాడంటున్న దక్షిణ కొరియా
South Korea believes Kim Jong Un alive

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడన్నదానిపై గత కొన్నిరోజులుగా స్పష్టత లేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కిమ్ చనిపోయి ఉండొచ్చని కొందరు, బ్రెయిన్ డెడ్ అయ్యుంటాడని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పొరుగునే ఉన్న దక్షిణ కొరియా మాత్రం ఈ ఊహాగానాలను మొదటి నుంచి ఖండిస్తోంది. తాజాగా, దక్షిణ కొరియా విదేశాంగ శాఖ సలహాదారు చుంగ్ ఇన్ మూన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కిమ్ బతికే ఉన్నాడని నమ్ముతున్నామని, ఆయన ఆరోగ్యంపై ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. కిమ్ కు ఏమీ కాలేదని దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా విశ్వసిస్తోందని పేర్కొన్నారు. కిమ్ ఏప్రిల్ 13 నుంచి వోన్ సాన్ ప్రాంతంలో ఉంటున్నట్టు తెలిసిందని, ఎలాంటి అనుమానాస్పద కదలికలు కూడా తమ దృష్టికి రాలేదని వివరించారు.

కాగా, తాజాగా కిమ్ వ్యక్తిగత రైలు వోన్ సాన్ ప్రాంతంలోనే నిలిచి ఉన్న శాటిలైట్ ఫొటోలు ఓ అమెరికా వెబ్ సైట్ లో వెల్లడయ్యాయి. కిమ్ చివరగా బహిరంగంగా కనిపించింది ఏప్రిల్ 11నే. పార్టీ సమావేశంలో పాల్గొన్న తర్వాత నుంచి కిమ్ మళ్లీ ఎక్కడా దర్శనమివ్వకపోవడంతో ఆయన పరిస్థితిపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు బయల్దేరాయి.

More Telugu News