Onion Load: లాక్ డౌన్ సమయంలో ముంబై నుంచి అలహాబాద్ కు వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్... విజయవంతమైన యువకుడు!

Master Plan of a youth to travel Native Place is Success
  • ముంబై ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న ప్రేమ్ మూర్తి
  • నిత్యావసరాల రవాణాకు అనుమతి ఉండటంతో ప్లాన్
  • ఉల్లిపాయల లోడ్ కొనుగోలు చేసి లారీలో అలహాబాద్ కు
  • హోమ్ క్వారంటైన్ చేసిన అధికారులు
లాక్ డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన ఓ యువకుడు, యూపీలోని అలహాబాద్ సమీపంలో ఉన్న తన స్వగ్రామానికి ఎలాగైనా వెళ్లాలన్న ఆలోచనతో మాస్టర్ ప్లాన్ వేసి విజయవంతం అయ్యాడు. ఆ యువకుడి పేరు ప్రేమ్ మూర్తి పాండే. ముంబైలోని విమానాశ్రయంలో పని చేస్తుంటాడు. తాను ఎలా అలహాబాద్ కు చేరుకున్నానన్న విషయాన్ని అతనే మీడియాకు వెల్లడించాడు.

తొలి దశ లాక్ డౌన్ సమయాన్ని ముంబైలోనే గడిపిన అతను, లాక్ డౌన్ ను పొడిగించిన తరువాత దీన్ని మరింతకాలం పొడిగిస్తారని, ఎలాగైనా ఊరికి వెళ్లాల్సిందేనని భావించాడు. "వాస్తవానికి నేను అంధేరీ ఈస్ట్ ప్రాంతంలోని ఆజాద్ నగర్ లో నివాసం ఉంటున్నాను. ఇది చాలా ఇరుకైన ప్రాంతం. వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు పుష్కలం. బస్సులు, రైళ్లు ఏవీ తిరగడం లేదు. దీంతో నా దారిని నేను వెతుక్కోవాలని భావించాను. నిత్యావసరాలైన పండ్లు, కూరగాయల వాహనాలకు అనుమతి ఉందని గమనించాను" అని ప్రేమ్ మూర్తి పాండే వెల్లడించాడు.

ఏప్రిల్ 17న నాసిక్ లోని పింపాల్ గావ్ మార్కెట్ నుంచి మినీ ట్రక్ ను అద్దెకు తీసుకుని రూ. 10 వేల విలువైన పుచ్చకాయలను కొనుగోలు చేసి, దానితో పాటు ముంబైకి ప్రయాణించి, ట్రయల్ వేశాడు. ఆ పుచ్చకాయలను విక్రయించి, తన పెట్టుబడిని వెనక్కు తెచ్చుకున్నాడు. అదే సమయంలో మార్కెట్లో ఉల్లిపాయల డీల్ బాగుందని గమనించాడు. కిలోకు రూ. 9.10 చొప్పున రూ. 2.32 లక్షలతో 25,520 కిలోల లోడ్ ను కొన్నాడు. ఆపై రూ. 77,500 చెల్లించేందుకు అంగీకరించి, ఓ లారీని అద్దెకు తీసుకున్నాడు. 20వ తేదీన ఉల్లిపాయల లోడ్ తో 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలహాబాద్ కు బయలుదేరాడు.

23న అలహాబాద్ చేరుకుని, నేరుగా ఉల్లిపాయలను విక్రయించేందుకు ముందేరా హోల్ సేల్ మార్కెట్ కు వెళ్లాడు. అయితే, ఆ ఉల్లిని కొనేందుకు వ్యాపారులు ఎవరూ లభించలేదు. దీంతో చేసేదేమీ లేక, లారీని నగర శివార్లలోని తన స్వగ్రామమైన కోత్వా ముబారక్ పూర్ కు తీసుకెళ్లి, ఉల్లిపాయలను అన్ లోడ్ చేసి, నేరుగా టీపీ నగర్ పోలీసు స్టేషన్ కు వచ్చి వివరం చెప్పాడు. అతనికి వైద్య పరీక్షలు చేయించిన పోలీసు అధికారులు, ఇంట్లో హోమ్ క్వారంటైన్ చేశారు.

ఇక స్వగ్రామం చేరేందుకు తాను పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న నమ్మకం ఉందని, ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని సాగర్ ప్రాంతం నుంచి వచ్చిన ఉల్లిపాయలు మార్కెట్లో ఉన్నాయని, వాటి సరఫరా పూర్తి కాగానే, తాను తెచ్చిన నాసిక్ ఉల్లి రకానికి కొనుగోలుదారులు లభిస్తారన్న ఆశాభావాన్ని ప్రేమ్ మూర్తి పాండే వ్యక్తం చేశాడు. 
Onion Load
Mumbai
Allahabad
Lockdown
Prem Murti Pandey

More Telugu News