Akshaya Triteeya: నేడు అక్షయ తృతీయ... అంతా ఆన్ లైన్ లో మాత్రమే!

  • బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదం
  • ఆన్ లైన్ లో ఫిజికల్ బంగారం కొనుగోలు చేయవచ్చంటున్న నిపుణులు
  • తక్కువ మొత్తాలను కూడా పెట్టుబడిగా పెట్టే చాన్స్
All Sales of Akshaya Triteeya Through Online Only

నేడు అక్షయ తృతీయ... బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదంగా భావించే రోజు. అయితే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండడంతో ఈ పండగ ప్రతి సంవత్సరం మాదిరిగా సాగే అవకాశాలు లేవు. బంగారం దుకాణాలు తెరిచి ఉంటే, ప్రజలు బయటకు వెళ్లి తమ సెంటిమెంట్ ను కొనసాగించి వుండేవారు. షాపుల యాజమాన్యాలు సైతం పలు రకాల ఆఫర్లతో ఊదర గొట్టేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు.

దీంతో ఈ సంవత్సరం అక్షయ తృతీయ వ్యాపారం కేవలం ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఫిజికల్ బంగారం బదులు, డిజిటల్ రూపంలో కొనుగోళ్లు చేయవచ్చని ఈ రంగంలోని నిపుణులు వెల్లడించారు. కస్టమర్లు పెట్టే పెట్టుబడికి సరిపడా ఫిజికల్ బంగారాన్ని ఆయా సంస్థలు ఎంఎంటీసీ లాంటి సంస్థలతో కలిసి నిల్వ చేస్తాయి. ఇక ఒక్క రూపాయి నుంచి ఎంతైనా పెట్టి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ యాప్స్‌ పేటీఎం, ఫోన్‌పే, ఆగ్మెంట్,  మోతీలాల్‌ ఓస్వాల్‌‌ తదితర ఎన్నో ప్లాట్ ఫామ్స్ ఇందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

సాధారణ పరిస్థితుల్లో అయితే, ఔత్సాహికులు షాపునకు వెళ్లి బంగారం కొనుగోలు చేసేవారు. అక్కడ బంగారం గ్రాముల్లో ఉంటుంది. సావరిన్ బాండ్లు కొనాలన్నా కనీసం ఒక గ్రాము బంగారం తీసుకోవాలి. అయితే పేమెంట్ యాప్స్ ద్వారా చాలా చిన్న మొత్తాల్లో కూడా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. మీరు కొన్న బంగారాన్ని ఇంటి వద్ద డెలివరీ తీసుకునే సదుపాయంతో పాటు, డిజిటల్‌ బంగారాన్ని ఆభరణాల సంస్థలకు బదిలీ చేసుకుని కావాల్సిన నగలను కూడా కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది.

అక్షయ తృతీయ సెంటిమెంట్ ను ప్రజలు కొనసాగించేలా చూడాలని భావిస్తున్న పలు కంపెనీలు ఇప్పటికే చాలా రకాల ఆఫర్లను ప్రకటించాయి. నచ్చిన ఆఫర్ ను చూసుకుని ఆభరణాన్ని లేదా బంగారాన్ని ఆన్ లైన్ లోనే కొనుగోలు చేయవచ్చు. పరిస్థితులు మారిన తరువాత, కొన్న బంగారం ఇంటికే వస్తుంది.

More Telugu News