Sachin Tendulkar: అప్పుడు రవిశాస్త్రి ఇచ్చిన సలహా నా కెరీర్ నే మార్చేసింది: సచిన్

  • 16 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ఎంపికైన సచిన్
  • పాకిస్థాన్ లో తొలి పర్యటన
  • మొదటి అంతర్జాతీయ ఇన్నింగ్స్ లో వైఫల్యం
Sachin reveals about Ravishastri advice in Pakistan tour that shaped his career

భారత్ లో క్రికెట్ దేవుడిగా మన్ననలు అందుకునే సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ యవనికపై నమోదు చేసిన రికార్డులు అన్నీఇన్నీ కావు. అంతటి దిగ్గజం కూడా తొలి సిరీస్ లో ఎంతో నిరాశకు గురయ్యాడట. పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో కెరీర్ ముగిసినట్టేనని భావించాల్సి వచ్చిందని సచిన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సచిన్ 16 ఏళ్ల వయసులోనే భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. సచిన్ తొలి పర్యటన పాకిస్థాన్ లో జరిగింది.

ఆ సమయంలో వసీం అక్రమ్, వకార్ యూనిస్ జోడీ శత్రుభీకర ద్వయంగా పేరుతెచ్చుకుంది. అలాంటి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ సచిన్ తన తొలి అంతర్జాతీయ ఇన్నింగ్స్ లో 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దాంతో అదే తన చివరి ఇన్నింగ్స్ అని నిర్ధారణకు వచ్చేశాడట. అయితే తన ఆలోచనా సరళిని అప్పటి సీనియర్ ఆటగాడు రవిశాస్త్రి మార్చేశాడని సచిన్ వివరించాడు. రవిశాస్త్రి ఇచ్చిన సలహా తన కెరీర్ నే మార్చేసిందని చెప్పాడు.

"ఈ మ్యాచ్ ను ఓ స్కూల్ మ్యాచ్ తరహాలో ఆడేశావు. అయితే నువ్వు ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్ జోడీని ఎదుర్కొన్నావని గుర్తుంచుకోవాలి. వాళ్ల సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని గౌరవించాలి. మైదానంలోకి వెళ్లి ఓ గంటసేపు క్రీజులో నిలిచావంటే వాళ్ల పేస్ కు ఈజీగా అలవాటు పడతావు. అక్కడి నుంచి ప్రతిదీ నీ నియంత్రణలోకి వస్తుంది" అని రవిశాస్త్రి హితవు పలికాడని, ఆ మరుసటి మ్యాచ్ లో రవిశాస్త్రి చెప్పింది అక్షరాలా పాటించి 59 పరుగులు చేశానని సచిన్ వెల్లడించాడు. అక్కడి నుంచి ఆటపై తన దృక్పథంలో మార్పు వచ్చిందని, ఇదే మొదటిది, చివరి సిరీస్ అనుకున్న తాను ఆపై వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదని తెలిపాడు.

More Telugu News