CSIR: తీగ జాతి మొక్క నుంచి 'కరోనా' ఔషధం తయారీ... అనుమతి కోసం చూస్తున్న సీఎస్ఐఆర్!

  • పరిశోధకుల్లో ఆశలు రేకెత్తిస్తున్న చీపురుతీగ
  • డెంగ్యూపై సమర్థంగా పనిచేసిన ఔషధం
  • డీజీసీఐ అనుమతి కోసం దరఖాస్తు
CSIR researchers seeks DGCI approval for Cocculus Hirsutus based medicine

కోక్యులస్ హిర్సుటస్ అంటే ఏంటో చాలామందికి తెలియకపోవచ్చు కానీ, చీపురుతీగ, దూసరతీగ అంటే మాత్రం పల్లెటూళ్లలో ఉండే చాలామంది గుర్తుపట్టేస్తారు. తీగ జాతికి చెందిన ఈ మొక్క ఇప్పుడు శాస్త్రవేత్తల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే చీపురుతీగ నుంచి తయారుచేసిన ఔషధాన్ని డెంగ్యూపై పరీక్షించారు. అయితే దీని సమర్థత కరోనా వైరస్ పై ఏ మేరకు ఉంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ వృక్ష ఆధారిత ఔషధంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఎన్నో ఆశలు పెట్టుకుంది.

ప్రస్తుతం ఈ ఔషధం పనితీరును అంచనా వేసేందుకు ప్రయోగాలు నిర్వహించాలని సీఎస్ఐఆర్ భావిస్తోంది. ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కి దరఖాస్తు చేసుకుంది. పరిమిత సంఖ్యలో 50 మంది రోగులపై పరీక్షలు జరిపి ఈ ఔషధం సమర్థతను తెలుసుకోవాలని సీఎస్ఐఆర్ భావిస్తోంది. కోక్యులస్ హిర్సుటస్ నుంచి తయారుచేసిన ఔషధంలో యాంటీ వైరల్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉన్నందున డెంగ్యూపై ప్రాథమిక పరీక్షల్లో ప్రభావవంతంగా పనిచేసిందని సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పుడు తాము ఈ ఔషధాన్ని కరోనాపై ప్రయోగించేందుకు డీజీసీఐ అనుమతి కోసం చూస్తున్నామని, దీన్ని దేశంలోని గిరిజనులు ఉపయోగిస్తుంటారని వెల్లడించారు.

More Telugu News