Ana Del Walle: వందేళ్ల కిందట చిన్నారిగా స్పానిష్ ఫ్లూను జయించి.. నేడు శతాధిక మహిళగా కరోనాపై గెలిచింది!

  • స్పెయిన్ లో కరోనా నుంచి కోలుకున్న 106 ఏళ్ల మహిళ
  • 1918లో స్పానిష్ ఫ్లూ సోకినా కోలుకున్న వైనం
  • ఈ వయసులోనూ నిత్యం వాకింగ్
Ana Del Walle wins corona as she beat spanish flu in her childhood

అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. కరోనాతో విలవిల్లాడుతున్న స్పెయిన్ లో 106 ఏళ్ల వయసున్న పండు ముదుసలి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెను కరోనా మహమ్మారి సైతం ఏమీ చేయలేకపోయింది. కరోనా సోకినా కొన్నిరోజుల్లోనే కోలుకుని అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఆమె పేరు అనా డెల్ వాలీ. విశేషం ఏంటంటే, అనా డెల్ నాలుగేళ్ల చిన్నారిగా ఉన్నప్పుడు ప్రమాదకర స్పానిష్ ఫ్లూ బారినపడింది. అయితే అప్పుడు కూడా అనా డెల్ దే పైచేయి అయింది. ఇది జరిగి సుమారు 102 ఏళ్లు అవుతోంది.

1918 ప్రాంతంలో ప్రపంచాన్ని స్పానిష్ ఫ్లూ గడగడలాడించింది. 500 మిలియన్ల మంది ఈ ఫ్లూ బారినపడ్డారు. నాటి ప్రపంచ జనాభాలో మూడోవంతు మందికి ఈ ఫ్లూ సోకింది. ఆ సమయంలో చిన్నారిగా ఉన్న అనా డెల్ స్పానిష్ ఫ్లూపై జయకేతనం ఎగురవేసింది. మళ్లీ వందేళ్ల తర్వాత కరోనా బారిన పడినా, ఇక్కడా ఆమెనే విజయం వరించింది. ఇప్పటికీ తన పనులు తాను చేసుకోగలిగే ఈ స్పానిష్ వృద్ధురాలు నిత్యం వాకింగ్ చేస్తుంది. అదే ఆమె ఆరోగ్య రహస్యం అని కుటుంబ సభ్యులు అంటున్నారు.

More Telugu News