mumbai: ధారావిలో ఒక్కసారిగా తగ్గిన కరోనా కేసులు!

  • గురువారం 25 మందికి పాజిటివ్
  • తర్వాత  24 గంటల్లో ఆరు కేసులే నమోదు
  • మురికివాడలో ఇప్పటిదాకా 220 మందికి సోకిన వైరస్
Mumbais Dharavi Reports Sharp Drop In New Cases

ఆసియాలోనే  అతి పెద్ద మురికివాడగా పేరొందిన  ముంబైలోని ధారావిలో కరోనా కొత్త  కేసుల సంఖ్య ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. కరోనా హాట్‌స్పాట్‌గా గుర్తించిన ఈ ప్రాంతంలో  గురువారం 25  కొత్త కేసులు నమోదవగా.. గడచిన 24 గంటల్లో మరో ఆరుగురికి మాత్రమే పాజిటివ్ అని తేలింది. కరోనా కారణంగా శుక్రవారం ఒక వ్యక్తి మాత్రమే చనిపోయాడు. ఈ మొత్తం ప్రాంతంలో ఇప్పటిదాకా 220 మందికి వైరస్ సోకగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 2.1 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో ఇరుకిరుకు ఇళ్లల్లో దాదాపు 8 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.

సామాజిక దూరం పాటించడం కష్టమైన ఈ ప్రాంతంలో  కరోనా వ్యాప్తిని తగ్గించడానికి  అధికారులు స్క్రీనింగ్, ఐసోలేషన్, క్వారంటైన్ చర్యలు ముమ్మరం చేశారు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ).. అనేక కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులు ఇంటింటికి పంపిస్తోంది. దాదాపు లక్షన్నర మంది ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వారందరికీ సరుకులు, మందులు నేరుగా ఇంటికే అందిస్తున్నారు. అలాగే, బీఎంసీ అధికారులు పలు చోట్ల ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా 50 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించి కొందరిని ఐసోలేషన్‌కు, కరోనా పరీక్షలకు సిఫారసు చేశారు.

More Telugu News