Lockdown: ఇక విమానం ఎక్కాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే!: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రకటన

  • పలు విషయాలు వివరించిన ఢిల్లీ విమానాశ్రయ అధికారులు
  • విమానం ఎక్కాలంటే మాస్కులు తప్పనిసరి
  • విమానంలో నో మీల్స్.. కేవలం నీళ్లు మాత్రమే ఇస్తాం
  • సామాజిక దూరం పాటించేలా చర్యలు
Mandatory masks no in flight meals restricted lavatory use

మరికొన్ని రోజుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేసే అవకాశాలు ఉండడంతో అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై పలు సంస్థలు దృష్టిపెడుతున్నాయి. విమాన ప్రయాణాలు చేసేవారితో పాటు, విమాన సిబ్బంది తప్పకుండా మాస్కులు వాడాల్సిందేనని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పేర్కొన్నారు.

అంతేకాదు, విమానంలో అందించే భోజనాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం నీళ్లు మాత్రమే అందించనున్నారు. టాయిలెట్లను సైతం పరిమిత సంఖ్యలో వాడనున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ ముగిసి, విమాన సేవలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తారు.

ఈ మేరకు ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖకు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు లేఖ ద్వారా ఈ విషయాలను తెలిపినట్లు సమాచారం. విమాన సేవలు తిరిగి ప్రారంభమైన వెంటనే ప్రయాణికులు గతంలోలా సామాజిక దూరం పాటించకుండా వ్యవహరించే ప్రమాదం ఉండడంతో ముందుగానే ఈ విషయంపై అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.  

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్యే తాము ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతిస్తామని ఓ అధికారి మీడియాకు తెలిపారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు తమ సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారని చెప్పారు. వారి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించిన తర్వాతే  టెర్మినల్‌కు వెళ్లేందుకు అనుమతిస్తామని వివరించారు.  

ఫేస్‌ మాస్క్‌ను ధరించని వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు సామాజిక దూరం పాటించేలా చేస్తామని, వారిని విడతల వారీగా విభజించి మెడికల్‌ టెస్టులు చేస్తామని వివరించారు. విమానయాన సంస్థలు కూడా పలు జాగ్రత్తలు తీసుకోనున్నాయి.

More Telugu News