Actor vijay: మిత్రుల మధ్య చిచ్చు పెట్టిన సినీ అభిమానం.. ఘర్షణలో హీరో విజయ్ అభిమాని మృతి!

Actor Vijay fan dead in quarrel with Rajinikanth Fan
  • కరోనా విరాళాల విషయంలో గొడవ
  • మా హీరోనే గొప్పంటూ ఇద్దరి మధ్య ఘర్షణ
  • మిత్రుడిని గట్టిగా నెట్టేయడంతో కిందపడి మృతి
కరోనా విరాళాల విషయంలో మా హీరో గొప్పంటే, కాదు మా హీరోనే గొప్పంటూ ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన వివాదం ముదిరి ఒకరి ప్రాణాలు బలిగొంది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరక్కానంలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. యువరాజ్ అనే యువకుడు హీరో విజయ్‌కు వీరాభిమాని. అతడి మిత్రుడు అయిన దినేశ్ బాబుకు సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ప్రాణం. ఇద్దరు మంచి మిత్రులే అయినప్పటికీ అభిమాన హీరోల విషయానికి వచ్చేసరికి ఇద్దరూ శత్రువుల్లా పోట్లాడుకునేవారు.

ఇదిలావుంచితే, కరోనా వైరస్‌పై పోరులో కదిలొస్తున్న నటులు తమకు తోచినంతగా విరాళాలు ప్రకటిస్తూ బాధితులకు చేయూత అందిస్తున్నారు. సరిగ్గా ఇదే మిత్రుల మధ్య కయ్యానికి కారణమైంది. విరాళాల గురించి గురువారం వీరి మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో తమ హీరో పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చాడంటే, కాదు తమ హీరోనే ఇచ్చాడంటూ ఇద్దరూ వాదులాడుకున్నారు. అది కాస్తా ముదరడంతో ఇద్దరూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఒకరినొకరు నెట్టుకున్నారు.

ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన దినేశ్‌బాబు.. యువరాజ్‌ను గట్టిగా నెట్టేయడంతో అతడు ఒక్కసారిగా కిందపడ్డాడు. దీంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిత్రుడు చనిపోవడంతో షాకైన దినేశ్ బాబు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న దినేశ్‌బాబును నిన్న అదుపులోకి తీసుకున్నారు.
Actor vijay
Rajinikanth
Corona Virus
Tamil Nadu

More Telugu News