Rapid Testing Kits: కిట్లు ఉపయోగించే విధానం తెలియక మాపై నిందలు వేస్తారా?: భారత్ పై చైనా సంస్థల అసంతృప్తి

  • చైనా కిట్లు లోపభూయిష్టం అంటున్న రాష్ట్రాలు
  • లోపం మీ వైద్యసిబ్బందిలోనే ఉందన్న చైనా సంస్థలు
  • కిట్లపై ఉన్న సూచనలు చదివి పరీక్షలు నిర్వహించాలని హితవు
China rapid testing kits manufacturers responds on India allegations

చైనా నుంచి దిగుమతి చేసుకున్న కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ భారత్ లోని అనేక రాష్ట్రాలు ఆరోపించడం తెలిసిందే. దీనిపై చైనాలోని ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీదార్లు ఘాటుగా స్పందించారు. కిట్లను ఉపయోగించే విధానం తెలియక మాపై ఆరోపణలు చేస్తారా? అంటూ రెండు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

తాము తయారుచేసిన కిట్లలో ఎలాంటి లోపాలు లేవని, లోపం ఉన్నదల్లా భారత్ లోని వైద్యసిబ్బందిలోనే అని ఆయా సంస్థలు స్పష్టం చేశాయి. తాము ఈ కిట్లను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నామని వోండ్ ఫో బయోటెక్,  లివ్ జోన్ డయాగ్నస్టిక్స్ సంస్థలు వెల్లడించాయి. టెస్ట్ కిట్ పై ఉన్న సూచనలను పూర్తిగా చదివిన తర్వాతే వాటితో పరీక్షలు నిర్వహించాలని హితవు పలికాయి.

చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వస్తున్నాయన్న సమాచారంతో ఐసీఎంఆర్ వెంటనే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వినియోగాన్ని నిలిపివేసింది. భారత్ కు చెందిన అంటువ్యాధుల నిపుణుడొకరు దీనిపై స్పందిస్తూ, చైనా కంపెనీలు ఈ కిట్లను ఎంతో హడావిడిగా రూపొందించి ఉంటాయని, సరైన ముందస్తు పరీక్షలు నిర్వహించకుండానే ఎగుమతులకు సిద్ధం చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు ఆదరాబాదరాగా కిట్లను ఆయా దేశాలకు ఎగుమతి చేసినట్టుగా అనిపిస్తోందని, కొద్ది సంఖ్యలోనే పరీక్షించి ఉంటారని సందేహం వ్యక్తం చేశారు.

More Telugu News