China: ఓపక్క మిగతా దేశాలు కరోనాతో కుస్తీ పడుతుంటే.. మరోపక్క చైనా కుటిల యత్నాలు!

  • దక్షిణ చైనా సముద్రంపై పట్టుకు పునఃప్రయత్నాలు
  • ఇటీవలే వియత్నాం నౌక ముంచివేత
  • చైనా బెదిరింపులకు పాల్పడుతోందన్న అమెరికా
China restarts its agenda in south china sea

డ్రాగన్ కంట్రీగా పేరుగాంచిన చైనా చర్యలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకు ఇదే నిదర్శనం. ఓవైపు ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే, ఇప్పటికే కోలుకున్న చైనా దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యం నిరూపించుకునే చర్యలను పునఃప్రారంభించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న పారాసెల్ ఐలాండ్స్, స్ప్రాట్లీ ఐలాండ్స్ ను రెండు జిల్లాలుగా అభివృద్ధి చేసేందుకు మళ్లీ రంగంలోకి దిగింది.

దక్షిణ చైనా సముద్రంలో ఉన్న అనేక దీవుల్లో పాగా వేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల పట్ల వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, మలేసియా, బ్రూనై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చైనాకు ఈ దేశాలతో ప్రాదేశిక జలాలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ఈ దేశాలను దక్షిణ చైనా సముద్రంలోకి అడుగుపెట్టనివ్వరాదన్నది చైనా ప్రణాళిక.

తాజాగా, ఆయా దేశాలు సహజవాయువు, చమురు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనివ్వకుండా చైనా తన యుద్ధ నౌకలను సముద్రంలో మోహరించి బెదిరింపులకు పాల్పడుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. అన్ని దేశాలు కరోనా కట్టడి చర్యలతో తలమునకలుగా ఉన్నవేళ చైనా ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటోందని ఆయన విమర్శించారు. ఇటీవల వియత్నాంకు చెందిన ఓ ఫిషింగ్ నౌకను చైనా యుద్ధనౌకలు సముద్రంలో ముంచివేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 కాగా, దీనిపై భారత్ ఇంకా స్పందించలేదు. దక్షిణ చైనా సముద్రంలోని ఓ భాగమైన ప్రఖ్యాత మలక్కా జలసంధి ద్వారానే భారత్ కు సంబంధించిన 55 శాతం వాణిజ్యం జరుగుతుంది.

More Telugu News