Facebook: 267 మిలియన్ల మంది ఫేస్ బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం 'డార్క్ వెబ్' కు అమ్మకం!

  • ఫేస్ బుక్ లో మరో భారీ లీకేజి?
  • యూజర్ల సమస్త వివరాలు తరలి వెళ్లాయంటున్న సైబర్ నిపుణులు
  • రెండంచెల భద్రత ఏర్పాటు చేసుకోవాలని యూజర్లకు సూచన
Cyber security firm says there was a massive data leak

గతంలో అనేక పర్యాయాలు ఫేస్ బుక్ నుంచి యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకైన ఉదంతాలు జరిగాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఫేస్ బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మళ్లీ ఆ స్థాయిలో ఫేస్ బుక్ ఖాతాదారుల సమాచారం లీకైనట్టు తెలిసింది. దాదాపు 267 మిలియన్ల మందికి పైగా ఫేస్ బుక్ యూజర్ల వ్యక్తిగత వివరాలు 'డార్క్ వెబ్' చేతుల్లోకి వెళ్లినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ 'సోఫోస్' వెల్లడించింది. యూజర్ ఐడీలు, ఖాతాదారు పూర్తి పేరు, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్లు, టైమ్ స్టాంప్ వివరాలు, రిలేషన్ షిప్ స్టేటస్, వయసు ఇత్యాది అంశాలన్నీ 'డార్క్ వెబ్' కు విక్రయించినట్టు 'సోఫోస్' తెలిపింది.

ఫేస్ బుక్ లోని థర్డ్ పార్టీ ఏపీఐ లోపాలను ఆధారంగా చేసుకుని ఈ డేటాను తస్కరించి ఉండే అవకాశాలను కొట్టిపారేయమని మరో సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. ఫేస్ బుక్ యూజర్లు వెంటనే తమ ఖాతాల భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకోవాలని, లేకపోతే సైబర్ నేరగాళ్ల వలకు చిక్కే అవకాశాలు ఉంటాయని హెచ్చరించింది. మెరుగైన భద్రత కోసం రెండంచెల పాస్ వర్డ్ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

డార్క్ వెబ్ అంటే... ఎన్ క్రిప్షన్ చేయబడిన వెబ్ సైట్ డేటా లేదా రహస్య సంకేతాలతో కూడిన ఆన్ లైన్ కంటెంట్. ఇలాంటి వెబ్ సైట్లు సాధారణ సెర్చ్ ఇంజిన్లలో కనిపించవు. ప్రత్యేకంగా నిర్వాహకుల నుంచి 'కీ' లభిస్తేనే, దాని సాయంతో వీక్షించవచ్చు. సబ్ స్క్రైబర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీన్నే 'డార్క్ నెట్' అని కూడా అంటారు. వీటి డొమైన్లు కూడా సంఖ్యలు, సంజ్ఞలు, ఇతర రహస్య సంకేత నామాలతో కూడి ఉంటాయి.

More Telugu News