IIT Roorkey: ఐదు సెకన్లలో కొవిడ్-19ను గుర్తించే సాఫ్ట్ వేర్ రూపొందించిన ఐఐటీ ప్రొఫెసర్!

  • ఎక్స్ రే స్కాన్ తో వైరస్ ను గుర్తించవచ్చంటున్న ప్రొఫెసర్ జైన్
  • కరోనా పరీక్షల ఖర్చు తగ్గుతుందని వెల్లడి
  • వైద్య సిబ్బందికి కరోనా సోకే ప్రమాదం కూడా ఉండదని వివరణ
IIT Roorkey professor says new software identifies corona within five seconds

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా స్వైరవిహారం చేస్తున్న వేళ ఓవైపు పరిశోధకులు వ్యాక్సిన్ తయారీకి అహోరాత్రాలు శ్రమిస్తుండగా, మరోవైపు వైజ్ఞానికులు వైరస్ ను వేగంగా గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయడంలో తలమునకలుగా ఉన్నారు. ఈ క్రమంలో ఐఐటీ రూర్కీకి చెందిన ఓ ప్రొఫెసర్ 5 సెకన్లలో కొవిడ్-19 వైరస్ ను గుర్తించే సరికొత్త సాఫ్ట్ వేర్ కు రూపకల్పన చేశారు. అనుమానిత రోగికి ఎక్స్ రే స్కాన్ తీయడం ద్వారా స్వల్ప వ్యవధిలోనే రోగ నిర్ధారణ చేయవచ్చని సదరు ప్రొఫెసర్ అంటున్నారు.

ఐఐటీ రూర్కీలో కమల్ జైన్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కొత్త పరీక్ష విధానం కోసం 40 రోజుల పాటు శ్రమించిన జైన్, తన సాఫ్ట్ వేర్ పై పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు, తన పరిశోధనలపై సమీక్షించాల్సిందిగా భారతీయ వైద్య మండలి (ఐసీఎంఆర్)ని కోరారు. దీనిపై ప్రొఫెసర్ జైన్ స్పందిస్తూ, తన సాఫ్ట్ వేర్ తో కరోనా పరీక్షల ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా, వైద్య సిబ్బందికి కరోనా సోకే ప్రమాదం కూడా తక్కువ అని వెల్లడించారు.

"కృత్రిమ మేధ విధానం రూపొందించి ఈ పరిశోధన సాగించాను. మొదట న్యూమోనియా, టీబీ రోగుల ఎక్స్ రే స్కాన్లను పరిశీలించాను. ఆ తర్వాత కొవిడ్-19 రోగుల ఛాతీ ఎక్స్ రే స్కాన్లను పరిశీలించాను. న్యూమోనియా, టీబీ రోగులకు, కరోనా రోగులకు ఛాతీలో ఉన్న శరీర ద్రవాల మధ్య తేడాను గుర్తించగలిగాను. నా పరిశోధనలో భాగంగా 60 వేలకు పైగా ఎక్స్ రే స్కాన్లను పరిశీలించాను. నేను రూపొందించిన సాఫ్ట్ వేర్ సాయంతో వైద్యులు ఎంతో సులువుగా కరోనా వైరస్ ను గుర్తించే వీలుంది. రోగి ఎక్స్ రే స్కాన్లను అప్ లోడ్ చేస్తే చాలు... ఆ రోగిలో ఉన్న న్యూమోనియా లక్షణాలు కరోనా కారణంగా వచ్చినవో, లేక ఇతర బ్యాక్టీరియా కారణంగా వచ్చినవో ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాదు, ఇన్ఫెక్షన్ తీవ్రతను కూడా చెప్పేస్తుంది" అని ప్రొఫెసర్ జైన్ వివరించారు.

More Telugu News