Arnab Goswami: భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది: అర్నాబ్ గోస్వామి

  • రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంలో ఊరట
  • అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు
  • శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానంటూ గోస్వామి వీడియో సందేశం
Arnab Goswami video message as Supreme Court upholds his right to report

పాల్గర్ మూక హత్య నేపథ్యంలో సోనియా గాంధీపై వ్యాఖ్యలు చేసిన రిపబ్లిక్ టీవీ చానల్ అధినేత అర్నాబ్ గోస్వామిపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసుల విచారణకు సంబంధించి అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మూడు వారాల పాటు అరెస్టు నుంచి గోస్వామికి రక్షణ కల్పిస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది. దీనిపై అర్నాబ్ గోస్వామి ఓ వీడియో ద్వారా స్పందించారు. అరెస్ట్ నుంచి తనకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందన్నారు.

"ఓ వార్తను రిపోర్టు చేయడానికి, ప్రసారం చేయడానికి నాకు అనుమతి ఇవ్వడం ద్వారా రాజ్యాంగపరమైన హక్కులను కాపాడిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు. ఓ పాత్రికేయుడిగా నా భావవ్యక్తీకరణ స్వేచ్ఛను సుప్రీం రక్షించింది. పాల్గర్ సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుదారుల ఫిర్యాదులతో నాపై 150కి పైగా ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

కానీ సుప్రీంకోర్టు నాపైనా, నా నెట్ వర్క్ పైనా ఇలాంటి వేధింపులు, బెదిరింపులను అనుమతించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అత్యధిక రాష్ట్రాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. నాపైనా, నా అర్ధాంగిపైనా జరిగిన భౌతికదాడిని సుప్రీం గుర్తించింది. కాంగ్రెస్ అనుయాయులు జరిపిన ఈ దాడి నేపథ్యంలో ముంబయి పోలీసు యంత్రాంగాన్ని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, తగిన భద్రత కల్పించాలని సుప్రీం ఆదేశించింది.

ఓ పాత్రికేయుడిగా నా హక్కులను పరిరక్షించిన అత్యున్నత న్యాయస్థానానికి ఇవాళ శిరసు వంచి అభివందనం చేస్తున్నాను" అంటూ తీవ్ర భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

More Telugu News