KTR: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నాలుగు రకాల విప్లవాలు చూడబోతున్నాం: తెలంగాణ మంత్రి కేటీఆర్

  • రంగనాయకసాగర్‌ జలాశయంలోకి గోదావరి జలాల విడుదల
  • తెలంగాణ కోటి ఎకరాల మాగాణం త్వరలోనే కాబోతుంది
  • తెలంగాణలో హరిత విప్లవం వస్తుంది
  • నీలి విప్లవం, పాడి రైతులు క్షీర విప్లవం వస్తుంది
  • గొర్రెల పెంపకం ద్వారా గులాబీ విప్లవం వస్తుంది
ktr on projects

సిద్ధిపేటలోని రంగనాయకసాగర్‌ జలాశయంలోకి గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు చేతుల మీదుగా జరిగింది. అనంతరం జలాశయం వద్ద వారిద్దరు జలహారతి ఇచ్చారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉందని కానీ, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆయన రాలేదని చెప్పారు. ఈ చిరస్మరణీయ ఘట్టం తమ చేతుల మీదుగా ఆవిష్కృతం కావడం తమ అదృష్టమన్నారు. హరీశ్‌ రావు నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణంలోనూ కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా హరీశ్‌రావు శ్రమించారని కేటీఆర్‌ అన్నారు.  

సాగునీటి ప్రాజెక్టుల కోసం దశాబ్దాల కొద్దీ సమయం తీసుకోకుండా శర వేగంగా పనులు పూర్తి చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో నాలుగు రకాల విప్లవాలు చూడబోతున్నామని తెలిపారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం త్వరలోనే కాబోతుందని చెప్పారు. తెలంగాణలో హరిత విప్లవం వస్తుందన్నారు. అలాగే, మత్స్య సంపద పెరిగి రాష్ట్రంలో నీలి విప్లవం వస్తుందని చెప్పారు. పాడి రైతులు క్షీర విప్లవం తీసుకొస్తారని తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా గులాబీ విప్లవం వస్తుందన్నారు.

జలాలు రైతుల బతుకుదెరువు, జీవన స్వరూపాన్ని మారుస్తాయని హరీశ్ రావు అన్నారు. మత్స్య, పాడి పరిశ్రమ, పర్యాటక పరిశ్రమల అభివృద్ధికి నీళ్లే నాంది అని అన్నారు. త్వరలో సిద్ధిపేటకు రైలు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. సిద్ధిపేటలో ఒక్క ఇల్లు కూడా మునగకుండా జలాశయం నిర్మాణం జరిగిందన్నారు.

More Telugu News