Vishnu Vardhan Reddy: నాకు కేంద్ర సహాయ మంత్రి హోదా ఉంటుంది: నోటీసులపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • అవగాహన లేని వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • దేశంలో ఎక్కడికైనా తిరిగే వెసులుబాటు ఉంటుంది
  • వైసీపీ నేతలు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు
I didnt receive any notice says BJP leader Vishnuvardhan Reddy

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రెడ్ జోన్ లో ఉన్న కర్నూలుకు వెళ్లొచ్చిన కారణంగా... ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి అధికారులు హోం క్వారంటైన్ నోటీసులు ఇచ్చారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఆయన స్పందించారు. స్థానిక సీఐ, ఎస్సైలకు తెలియకే తన ఇంటికి నోటీసులు అతికించారని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. తనకు కేంద్ర సహాయ మంత్రి హోదా ఉంటుందని... దేశంలో ఎక్కడికైనా తిరిగే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. వీటిపై అవగాహన లేని వ్యక్తులు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

తనకు 24 గంటల పాటు సెక్యూరిటీ ఉంటుందని... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనకు భద్రతను కల్పిస్తాయని విష్ణు తెలిపారు. అధికార పార్టీ నేతలు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రులను క్వారంటైన్లో పెడతారా? అని ప్రశ్నించారు. సమాజసేవ చేయాల్సిన వారికి సహకరించాల్సిన అవసరం ఉందని... బీజేపీ నేతలపై అధికార పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.

కాగా, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ కి విష్ణువర్ధన్ రెడ్డి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

More Telugu News