Prashant Kumar: 'పారసైట్' చిత్రంపై రాజమౌళి వ్యాఖ్యలకు 'మిఠాయి' చిత్ర దర్శకుడి కౌంటర్

Mithai fame Prashant Kumar counters Rajamouli comments on Parasite movie
  • పారసైట్ చిత్రం బోర్ కొట్టించిందన్న రాజమౌళి
  • సినిమా చూస్తూ నిద్రపోయానని వెల్లడి
  • ఒరిజినాలిటీ ఉన్న చిత్రంపై ఇలాంటి వ్యాఖ్యలు తగదన్న ప్రశాంత్ కుమార్
ఇటీవల దర్శకుడు రాజమౌళి కొరియా చిత్రం 'పారసైట్'పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ సినిమా చూస్తూ నిద్రపోయానని రాజమౌళి కామెంట్ చేశారు. ఆ సినిమా తనను పెద్దగా ఆకట్టుకోలేదని తెలిపారు. బోర్ ఫీలయ్యానని పేర్కొన్నారు.

'పారసైట్' చిత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సినిమా కావడంతో రాజమౌళి ఇలా అన్నాడేంటి అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై 'మిఠాయి' చిత్రం దర్శకుడు ప్రశాంత్ కుమార్ కాస్తంత ఘాటుగానే స్పందించారు. 'ప్రియమైన రాజమౌళికి' అంటూ ట్విట్టర్ లో లేఖాస్త్రం సంధించారు.

"పారసైట్ ఒరిజినాలిటీ ఉన్న చిత్రం. ఒరిజినాలిటీకి ఎప్పుడైనా గౌరవం ఇవ్వాల్సిందే. భాషా సరిహద్దులను దాటుకుని మరీ వచ్చిన 'పారాసైట్' వంటి శక్తిమంతమైన చిత్రాలకు తప్పకుండా గౌరవం ఇవ్వాలి. తోటి దర్శకుడిగా మీ వ్యాఖ్యలు సరిగా లేవని, అభిరుచి రహితంగా ఉన్నాయని గుర్తించాను. ముఖ్యంగా మీ అభిప్రాయాలు తర్కానికి దూరంగా ఉన్నాయి. 'పారసైట్' చిత్రం ఓ చరిత్ర సృష్టించింది. ఓ విదేశీ చిత్రం ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడం మామూలు విషయం కాదు. సోర్సెర్సీ, టరాంటినో వంటి మహామహులు కూడా ప్రశంసించిన గొప్ప చిత్రం పారసైట్. నాకు తెలిసినంత వరకు వాళ్లు బాహుబలి గురించి ఏమీ చెప్పలేదు.

ఒరిజినాలిటీ గురించి మాట్లాడాలంటే, మీ సినిమాల్లో అందుకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు 'సై' సినిమా గురించి చెప్పాలంటే, అందులో మీరు ఎన్నో సీన్లను ఇతర సినిమాల నుంచి ఉన్నది ఉన్నట్టు ఎత్తేశారు. కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదు. 'పారసైట్' వంటి సినిమాలు ఆస్వాదించాలంటే నిర్దిష్ట ఆలోచనా పరిధి అవసరం. బహుశా మీరు అలాంటి దృక్పథంతో లేరేమో. యావత్ ప్రపంచం మెచ్చుకున్న ఓ బృహత్తర చిత్రాన్ని మీరు తేలిగ్గా తీసిపారేశారు. ఇది మీకు సరికాదు. భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రతినిధిలాంటి మీరు మమ్మల్నందరినీ మీ వ్యాఖ్యలతో బాధించారనడం సబబుగా ఉంటుంది.

ఇక నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే... మీ సినిమాలేవీ ప్రపంచ వేదికలపై ప్రశంసలకు దరిదాపుల్లోకి కూడా రావని భావిస్తున్నాను. కాబట్టి, యావత్ సినీ ప్రపంచం సమష్టిగా గౌరవించిన ఓ చిత్రంపై విమర్శలు చేసే హక్కు మనకు లేదనుకుంటున్నాను, ముఖ్యంగా ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై ఇది తగదు. చివరగా చెప్పాలంటే ఎవరి అభిప్రాయాలకు వాళ్లు అర్హులని భావిస్తాను. ఆల్ ది బెస్ట్" అంటూ విమర్శించారు. 
Prashant Kumar
Rajamouli
Parasite
Mithai
Tollywood

More Telugu News