Inzamam Ul Haq: మా కాలంలో భారత బ్యాట్స్ మెన్ సొంత ప్రయోజనాల కోసమే ఆడేవారు: ఇంజమమ్ ఉల్ హక్

  • మా రోజుల్లో భారత బ్యాట్స్ మెన్ స్వార్థంతో ఆడేవారు
  • సొంత రికార్డుల కోసం పరుగులు చేసేవారు
  • పాక్ బ్యాట్స్ మెన్ జట్టు కోసం ఆడేవారు

టీమిండియా బ్యాట్స్ మెన్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమమ్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ కాలంలో ఆడిన ఇండియన్ బ్యాట్స్ మెన్ చాలా స్వార్థపరులని అన్నాడు. జట్టులో వారి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసమే ఆడేవారని చెప్పాడు. భారత బ్యాట్స్ మెన్, పాక్ బ్యాట్స్ మెన్ కు ఉన్న తేడా ఇదేనని... పాక్  బ్యాట్స్ మెన్ సొంత రికార్డుల కోసం పాకులాడరని తెలిపాడు. ఓ యూట్యూబ్ ఛానల్ లో పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమమ్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు.

ఎంతో ట్యాలెంట్ ఉన్న పాకిస్థానీ ఆటగాళ్లు ఒక్క ఫెయిల్యూర్ రాగానే భయానికి గురవుతుంటారనే ప్రశ్నకు సమాధానంగా... సిరీస్ వారీగా ఆలోచించడమే దీనికి కారణమని... ఒకసారి ఫెయిల్ అయితే జట్టులో స్థానం కోల్పోతామేమోననే భయం వారిలో ఉందని ఇంజమమ్ చెప్పాడు. ఈ భయాలతోనే ఆటగాళ్లు వాళ్ల పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోతున్నారని తెలిపాడు.

ఒకటి, రెండు సిరీసుల్లో ఫెయిల్ అయినా... ఆటగాళ్లకు ఇమ్రాన్ ఖాన్ అవకాశం ఇచ్చేవారనే అంశంపై ఇంజమమ్ స్పందిస్తూ... 'తాము ఆడే రోజుల్లో పేపర్ పై భారత్ కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండేది. బ్యాట్స్ మెన్లుగా మా రికార్డులు వారికంటే తక్కువగా ఉండేవి. కానీ మాలో ఏ ఒక్కరైనా 30 లేదా 40 పరుగులు చేసినా... వాటిని టీమ్ కోసం చేసేవారం. కానీ ఇండియన్ బ్యాట్స్ మెన్ సెంచరీ కొట్టినా... అది జట్టుకోసం కాదు. వాళ్లు వాళ్ల రికార్డుల కోసమే పరుగులు చేసేవారు. రెండు జట్లకు మధ్య ఇదే తేడా' అని చెప్పాడు.

ఇప్పుడు పాక్ ప్లేయర్లు కూడా జట్టులో తమ స్థానం గురించి భయపడుతున్నారని ఇంజమమ్ తెలిపాడు. ఒకటి, రెండు ఇన్నింగ్స్ లలోనే తమను తాము నిరూపించుకోవాలనే భయంలో ఆటగాళ్లు ఉన్నారని... అందువల్లే టీమ్ కు ఏం అవసరమనేది వారికి అర్థం కావడం లేదని చెప్పాడు. కెప్టెన్, కోచ్ ఇద్దరి ఆలోచనా ధోరణి ఒకే విధంగా ఉంటే... ఆటగాళ్లకు భరోసాను కల్పిస్తారని తెలిపాడు.

More Telugu News