UK: బ్రిటన్ లో కరోనా కారణంగా చనిపోయిన జాతులలో భారతీయులే ఎక్కువ!

Indians Among Worst Affected Ethnic Groups In England
  • ఏప్రిల్ 17 వరకు ఆసుపత్రుల్లో 13,918 మరణాలు
  • వీరిలో 16.2 శాతం మంది బ్లాక్, ఏసియన్, మైనార్టీలు
  • ఈ సంఖ్యలో 3 శాతం మంది భారతీయులే
బ్రిటన్ ను కరోనా రక్కసి అతలాకుతలం చేస్తోంది. యూరప్ లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైన దేశాల్లో బ్రిటన్ ఒకటి. మరోవైపు, యూకేలో కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావితమైన జాతుల్లో భారతీయులు తొలి స్థానంలో ఉన్నారని ఇంగ్లండ్ లోని నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకటించింది.

ఏప్రిల్ 17 వరకు బ్రిటన్ ఆసుపత్రుల్లో 13,918 మంది చనిపోయారని... వీరిలో 16.2 శాతం మంది నల్లజాతీయులు, ఏసియన్లు, మైనార్టీ వర్గీయులని తెలిపింది. వీరిలో భారత మూలాలు ఉన్నవారు 3 శాతం మంది ఉన్నారని చెప్పింది. తర్వాతి స్థానాల్లో కరీబియన్లు (2.9%), పాకిస్థానియన్లు  (2.1%)లు ఉన్నారు . బంగ్లాదేశీయులు (0.6%), ఆఫ్రికన్లు (1.9%), చైనీయులు (0.4%) ఉన్నారు.    

ఈ సందర్భంగా యూకే ఆరోగ్య మంత్రి మ్యాట్ హ్యాంకాక్ మాట్లాడుతూ, మృతుల్లో మైనార్టీలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ ఛైర్ చాంద్ నాగ్ పాల్ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలను సమానంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బ్లాక్, ఏసియన్, మైనార్టీ కమ్యూనిటీలను కాపాడటానికి మరిన్ని ఎక్కువ చర్యలను తీసుకోవాలని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని తెలిపారు.
UK
Britain
Corona Deaths
Indian

More Telugu News