Corona Virus: కరోనాతో దేశంలో సగం మరణాలు ఆ రెండు రాష్ట్రాలవే!

  • మహారాష్ట్ర, గుజరాత్‌లో కరోనా తీవ్ర ప్రభావం
  • ఐదు రోజుల్లో ఆరు నుంచి రెండో స్థానానికి గుజరాత్
  • దేశంలో రికవరీ రేటు 16 శాతం
 Half the corona deaths are of these two states

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతుండగా.. మహారాష్ట్ర అత్యధికంగా ప్రభావితం అవుతోంది. దాని తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో పరిస్థితి దారుణంగా ఉంది. బుధవారం దేశ వ్యాప్తంగా 1,273 కొత్త కేసులు నమోదైతే.. అందులో 52 శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల నుంచే వచ్చాయి. అలాగే, నిన్న 39 మంది చనిపోతే అందులో 79 శాతం మరణాలు ఈ రెండు రాష్ట్రాలవే. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 18 మంది చనిపోతే.. గుజరాత్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో ముందు నుంచే వైరస్ ప్రభావం ఎక్కువగా  ఉండగా.. గుజరాత్‌లో వ్యాప్తి క్రమంగా ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ నిన్న ఒక్క రోజే 229 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 2,407 కేసులతో కరోనాతో దేశంలో ఎక్కువ ప్రభావితం అయిన రెండో రాష్ట్రంగా నిలిచింది. ఐదు రోజుల క్రితం వరకూ ఆ రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో నిన్న 431 మందికి కరోనా సోకినట్టు తేలింది. దాంతో ఆ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 5,649కి చేరింది.  92 కొత్త కేసులు, మొత్తం 2,248 పాజిటివ్ కేసులతో ఢిల్లీ  మూడో స్థానంలో ఉంది.

దేశంలో ఇప్పటిదాకా 21,355 కేసులు నమోదవగా.. అందులో 48 శాతం మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ మూడు రాష్ట్రాలకు చెందినవి కావడం గమనార్హం. ఇక దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 683కి పెరిగింది. వీటిలో ఒక్క మహారాష్ట్ర నుంచే 269 మరణాలు సంభవించాయి. గుజరాత్‌లో 103 మంది మృతి చెందారు. దేశంలో కరోనా మరణాల్లో 55 శాతం ఈ రెండు రాష్ట్రాలవే కావడం గమనార్హం.

మన దేశంలో కరోనా సోకిన వారిలో ఇప్పటిదాకా 16 శాతం మంది కోలుకున్నారు. ఢిల్లీలో అత్యధికంగా 724 మంది కోలుకోగా. తమిళనాడులో 662, రాజస్థాన్‌లో 344, కేరళలో 308 మంది ఈ వైరస్‌ నుంచి బయటపడ్డారు.

More Telugu News