Narendra Modi: తెలంగాణ సీనియర్లు జంగారెడ్డి, మందాడికి స్వయంగా ఫోన్ చేసిన ప్రధాని!

  • 70 ఏళ్లు పైబడిన  సీనియర్ నేతలకు ఫోన్ కాల్స్
  • యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న నరేంద్ర మోదీ
  • మోదీ నుంచి ఫోన్ వస్తుందని ఊహించలేదన్న జంగారెడ్డి
Modi Phone Call to Mandadi and Janga Reddy

తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు చంపుపట్ల జంగారెడ్డి, మందాడి సత్యనారాయణరెడ్డి లకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. వారితో పాటు సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కేరళ చాన్స్ లర్ ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావుతో కూడా ప్రధాని మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.

70 సంవత్సరాలకు పైబడిన ఐదుగురు నేతలకు ప్రధాని స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారని ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు వెల్లడించారు. అంతకు ముందే పీఎంఓ అధికారులు కాల్ చేసి, వారి ఫోన్ నంబర్లను అడిగారని ఆయన తెలిపారు. ఇక, మోదీ తనకు కాల్ చేయడంపై జంగారెడ్డి స్పందించారు. నరేంద్ర మోదీ నుంచి తనకు ఫోన్ కాల్ వస్తుందని ఎంతమాత్రమూ ఊహించలేదని ఆయన అన్నారు.

భారతీయ జనతా పార్టీకి లోక్ సభలో ఇద్దరే ఇద్దరు సభ్యులున్న వేళ, వారిలో జంగారెడ్డి కూడా ఒకరన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మోదీ ప్రస్తావించారని తెలిపారు. తాను ప్రజలకు బాగా సేవ చేశానని మోదీ కితాబిచ్చారని, ఆయన ఫోన్ తో తనకెంతో సంతోషం కలిగిందని అన్నారు.

More Telugu News