Maharashtra: మరో మూడు వారాల్లో ముంబైలోనే 6.56 లక్షల కరోనా కేసులు!: హెచ్చరించిన కేంద్ర బృందం

  • గత వారంలో ముంబైలో పర్యటన
  • ఆపై సంచలన నివేదిక విడుదల
  • కేసుల సంఖ్య అంచనాలో తప్పుడు విధానాలు
  • నివేదికను కొట్టిపారేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
By May 15 Mumbai Corona Cases Rise Above 6 Lakhs

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 20 వేలను దాటింది. రోజుకు సగటున 1000కి పైగా కొత్త కేసులు వస్తున్నాయి. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో వాస్తవానికి ఈ సంఖ్య తక్కువే. అభివృద్ధి చెందిన దేశాల్లోని జనాభాతో కరోనా బాధితుల నిష్పత్తిని పోలిస్తే, ఇండియాలో వ్యాధి నియంత్రణలోనే ఉందని చెప్పవచ్చు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు ఇక్కడి లాక్ డౌన్ వైరస్ ను కొంతమేరకు నియంత్రించిందని చెబుతున్నా, పెరుగుతున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదన్నది వాస్తవం. పదులు, వందల నుంచి వేల పాజిటివ్ కేసుల దిశగా రాష్ట్రాలు నడుస్తున్నాయి.

ఇక ముంబయి నగరం కరోనాకు అతిపెద్ద హాట్ స్పాట్ కానుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఐదుగురు సభ్యుల బృందం హెచ్చరించిందంటూ తాజాగా మీడియాలో వార్తలొచ్చాయి. ఆ కథనం ప్రకారం, గత వారంలో నగరంలో పర్యటించిన ఈ కమిటీ, తన నివేదికను సమర్పించింది. ఈ నెలాఖరుకు కరోనా బాధితుల సంఖ్య 42,604కు, మే 15వ తేదీ నాటికి ఈ సంఖ్య 6,56,407కు చేరుతుందని హెచ్చరించింది. ఆ సమయానికి 13,636 వెంటిలేటర్లు, 4,83,000 ఐసోలేషన్‌ బెడ్ల కొరతను రాష్ట్రం ఎదుర్కొంటూ ఉంటుందని అంచనా వేసింది. ఈ నెలాఖరులోగా ఆక్సిజన్‌ సరఫరా అవసరం లేని 30 వేలకు పైగా ఐసోలేషన్‌ బెడ్లు, ఆక్సిజన్‌ సపోర్ట్ ‌తో కూడిన 5,466 బెడ్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఈ రిపోర్టు రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది.

ఇదే సమయంలో కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించగా, సీఎం ఉద్ధవ్ థాకరే ఓ వీడియోను విడుదల చేశారు. మహమ్మారిపై పోరాటానికి కట్టుబడివున్నామని స్పష్టం చేశారు. కేంద్ర బృందం విడుదల చేసిన లెక్కలు, భవిష్యత్ కేసుల విషయాన్ని గణించేందుకు వారు పాటించిన విధానాలు నమ్మదగినవి కాదని అన్నారు. కరోనాను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రజలు తమవంతు సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి క్షణం శ్రమిస్తున్నారని తెలిపారు.

More Telugu News