Arnab Goswami: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై అర్ధరాత్రి దాడి.. కాంగ్రెస్ వారి పనేనన్న అర్నబ్!

  • రాత్రి 12.15 గంటల సమయంలో ఘటన
  • భార్యతో కలిసి స్టూడియో నుంచి వస్తుంటే అడ్డుకున్న బైకర్లు
  • కారు అద్దాలు పగులగొట్టే ప్రయత్నం
  • యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారన్న అర్నబ్
Mid night Attack on Arnab Goswami

రిపబ్లికన్ టీవీ ఎడిటర్, ఇటీవల ఎడిటర్స్ గిల్డ్ కు రాజీనామా చేస్తున్నట్టు టీవీ లైవ్ లో ప్రకటించి సంచలనం కలిగించిన అర్నబ్ గోస్వామిపై గత అర్థరాత్రి దాడి జరిగింది. ముంబైలోని చానెల్ స్టూడియో నుంచి తన భార్యతో కలిసి ఇంటికి వెళుతున్న వేళ, ఈ ఘటన జరిగిందని అర్నబ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటనకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని ఆయన ఆరోపించారు.

అర్నబ్ గోస్వామి వెల్లడించిన వివరాల ప్రకారం, "రాత్రి 12.15 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాము. మా కారును రెండు బైక్ లు వెంబడించాయి. మా కారుకు సమాంతరంగా నడుపుతూ వారు కారులోకి తొంగిచూశారు. ఆపై ఓవర్ టేక్ చేసి, రోడ్డుకు అడ్డంగా బైక్ లను ఆపారు. వారి నుంచి తప్పించుకునేందుకు నేను కారును ఆపకుండా పోనిస్తుంటే, కారు అద్దాలను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఏదో ద్రావకం ఉన్న సీసాలను మా కారుపై విసిరేశారు. ఆ వెంటనే నేను కారును మరింత వేగంగా అక్కడి నుంచి పోనిచ్చాను. నా కారు వెనకే వస్తున్న సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టుకున్నారు" అని తెలిపారు.

ఆపై నా సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడగా, యూత్ కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు దాడికి యత్నించారని చెప్పారు. తమ నేతలు చెప్పినందునే దాడి చేసేందుకు వచ్చామని వారు అంగీకరించారని కూడా అర్నబ్ వెల్లడించారు. ఆపై తాను సమీపంలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు. తనపై దాడికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ, ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

More Telugu News