Alla Nani: ఏపీలో పరిస్థితి అదుపులోనే ఉంది: మంత్రి ఆళ్ల నాని

  • రాష్ట్రంలో ఇప్పటి వరకు 813  కేసులు నమోదయ్యాయి
  • అత్యధిక కేసులు నమోదైన గుంటూరుపై ప్రత్యేక దృష్టి
  • రెడ్ జోన్లలో ఫీవర్ ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేస్తాం 
Minister Alla Nani press meet

గుంటూరు జిల్లాలో ‘కరోనా’ పరిస్థితులపై మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకట రమణతో కలిసి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని ఇవాళ సమీక్షించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ, ‘కరోనా’ వ్యాప్తి విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితి అదుపులోనే ఉందని, సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని అన్నారు.  

రాష్ట్రంలో ఇప్పటి వరకు 813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 24 మంది మృతి చెందినట్టు వివరించారు. ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారని, 129 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ‘కరోనా’ ఏ విధంగా సోకిందో తెలియని కేసులు రాష్ట్రంలో 52 ఉన్నాయని, ఆ ఆనవాళ్లను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.

అత్యధిక కేసులు నమోదైన గుంటూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. గుంటూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయని, ఒకే కుటుంబంలో పది కేసుల వరకు ఉన్న ఫ్యామిలీలు ఐదు వరకు ఉన్నాయని చెప్పారు. రెడ్ జోన్లలో ఫీవర్ ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేయనున్నామని, రెండు మూడ్రోజుల్లో ఈ ఆసుపత్రులను ప్రారంభిస్తామని వివరించారు. ర్యాపిడ్ కిట్లను వినియోగించవద్దని ఐసీఎంఆర్ ఆదేశించిందని, ఈ నేపథ్యంలో పరీక్షల నిమిత్తం ప్రత్యేక యంత్రాలను తెప్పించామని, వీటిపై గంటకు సుమారు వంద పరీక్షలు చేయొచ్చని చెప్పారు.

More Telugu News