Executive Order: డాక్టర్ల కోసమే... 120 ఏళ్ల నాటి ఎపిడెమిక్ చట్టానికి సవరణలు చేసిన కేంద్రం!

  • ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చట్ట సవరణ
  • రూ. 5 లక్షల వరకూ జరిమానా, ఏడేళ్ల వరకూ జైలుశిక్ష
  • హెల్త్ వర్కర్లపై దాడులను సహించబోమన్న కేంద్రం
Amendments to Indian Epidemic Act

కరోనా కట్టడికి ప్రాణాలను అడ్డుపెట్టి శ్రమిస్తున్న వైద్యులపై కొన్ని చోట్ల దాడులు జరగడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, 120 ఏళ్ల నాటి ఎపిడెమిక్ యాక్ట్ కు సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశమైన కేంద్రం అత్యవసర ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకువచ్చింది.

ఇక ఈ చట్ట సవరణలో భాగంగా వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలుంటాయి. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టి, వెంటనే జైలుకు తరలిస్తారు. నేరం నిరూపితమైతే ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, రూ. లక్ష నుంచి రూ. 7 లక్షల వరకూ జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

"దేశమంతా డాక్టర్లకు సెల్యూట్ చేస్తున్న వేళ, కొందరు మాత్రం వారి ద్వారా వైరస్ వ్యాపిస్తోందని ఆరోపిస్తూ దాడులకు దిగుతున్నారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పౌర సమాజంలో ఇటువంటి దాడులకు స్థానంలేదు. అంత తీవ్రం కాని కేసుల్లో రూ. 50 వేల నుంచి 2 లక్షల జరిమానా, ఆరు నెలల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, తీవ్ర గాయాలు చోటుచేసుకునే తీవ్రమైన కేసుల్లో రూ. 2 లక్షల నుంచి రూ. 7 లక్షల జరిమానా, ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు" అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు.

ఈ చట్టంతో డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, అటెండర్లు తదితరాలకు రక్షణ కలుగుతుందని జవదేకర్ వ్యాఖ్యానించారు. హెల్త్ కేర్ నిపుణులకు బీమా కవరేజ్ ని కూడా విస్తరించినట్టు ఆయన పేర్కొన్నారు.

More Telugu News