వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసు: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

22-04-2020 Wed 15:42
  • ‘కరోనా’ నియంత్రణా చర్యలపై చర్చించాం  
  • ‘కరోనా‘ బాధితులకు ‘ఆయుష్మాన్’ కింద చికిత్స అందిస్తాం
  • వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే  రూ.8 లక్షల వరకు జరిమానా 
Central Minister Prakash Javadekar press meet

‘కరోనా’ నియంత్రణా చర్యలపై చర్చించామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గం సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కరోనా‘ బాధితులకు ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందిస్తామని చెప్పారు. దేశంలో 735 కొవిడ్ ఆస్పత్రులు,  రెండు లక్షలకు పైగా బెడ్లు, 15,000 వెంటలేటర్లు, ఎన్-95 మాస్కులు 25 లక్షలు అందుబాటులో ఉన్నాయని, మరో 50 లక్షల మాస్కుల తయారీకి ఆదేశించామని చెప్పారు.

‘కరోనా’ బాధితులకు సేవలందిస్తున్న  వైద్య సిబ్బంది రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఎవరైనా వారిపై దాడి చేస్తే సహించేది లేదని, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని, రూ. లక్ష నుంచి రూ.8 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వైద్యుల రక్షణకు ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని తెలిపారు. ‘కరోనా’ విధుల్లో ఉన్న అన్ని రకాల సిబ్బందికి రూ.50 లక్షల వరకు వైద్య బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.