Suryapet District: సూర్యాపేట డీఎంహెచ్‌ఓపై సర్కారు ఆగ్రహం...ఆకస్మిక బదిలీ వేటు

  • ఆయన స్థానంలో యాదాద్రి జిల్లా అధికారికి బాధ్యతలు
  • కరోనా కట్టడి చర్యల్లో వైఫల్యంపై గుర్రు
  • హైదరాబాద్‌ తర్వాత ఇక్కడే అధిక కేసులు

సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌ఓ) నిరంజన్‌పై తెలంగాణ ప్రభుత్వం ఆకస్మిక బదిలీ వేటు వేసింది. రాజధాని తర్వాత కరోనా కేసుల విస్తరణ శరవేగంగా జరుగుతున్నా కట్టడి చర్యల్లో ఆయన విఫలమయ్యారన్న కారణంతో స్థానచలనం కలిగించింది. ఆయన స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్‌ఓ సాంబశివరావుకు బాధ్యతలు అప్పగించింది.

యాదాద్రిలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రభుత్వం సాంబశివరావుపై విశ్వాసం కనబరిచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) తర్వాత అత్యధిక కేసులు సూర్యాపేట జిల్లాలోనే నమోదవుతున్నాయి.

ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు జిల్లా నుంచి ఎక్కువ మంది హాజరు కావడం, అధిక శాతం వైరస్‌ బారిన పడడం, వీరంతా కూరగాయల వ్యాపారులు కావడంతో ఇతరులకు వీరి నుంచి వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో ప్రత్యేక కార్యాచరణతో జిల్లాలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టింది.

అదే సమయంలో విధుల నిర్వహణలో విఫలం చెందారని డీఎంహెచ్‌ఓపై బదిలీ వేటు వేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 86 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నిన్న ఒక్కరోజే 26 కేసులు నమోదు కావడం గమనార్హం. జిల్లాలోని ఐదు క్వారంటైన్‌ కేంద్రాల్లో 210 మంది పరిశీలనలో ఉండగా, మరో 4,346 మంది గృహనిర్బంధంలో ఉన్నారు.

More Telugu News