Jio: రిలయన్స్ జియోలో రూ. 43,574 కోట్ల ఫేస్ బుక్ ఇన్వెస్ట్ మెంట్!

  • 9.99 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం
  • డిజిటల్ ఇండియా కల సాకారమవుతుందన్న ముఖేష్ అంబానీ
  • ఎన్నో రకాల సేవలను దగ్గర చేస్తామని ప్రకటన
Face Book Invests Above 43 Thousand Crores in Jio

దేశీయ టెలికం దిగ్గజ కంపెనీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లో భాగమైన జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ లో 9.99 శాతం వాటాను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ భారీ పెట్టుబడిని పెట్టనుంది. ఇండియాలో తమ డిజిటల్ ఆపరేషన్స్ పరిధిని మరింతగా విస్తరించుకోవాలన్న ఆలోచనలో ఉన్న ఫేస్ బుక్, జియోలో ఏకంగా రూ. 43,574 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. వాస్తవానికి ఈ నెలాఖరులో ఫేస్‌ బుక్ ‌తో ఈ డీల్ గురించి జియో ప్రకటిస్తుందని భావించినా, అంతకు ముందే జియో దీనిపై మీడియా ప్రకటన విడుదల చేసింది.

దీని ప్రకారం, ఫేస్ బుక్ పెట్టుబడి తరువాత జియో ప్లాట్ ఫామ్స్ విలువ రూ. 4.62 లక్షల కోట్లకు పెరిగినట్లవుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థగా, తదుపరి తరం టెక్నాలజీని దేశానికి అందిస్తూ, ఎన్నో డిజిటల్ యాప్స్ ను అందిస్తున్న జియో, హై స్పీడ్ కనెక్టివిటీ ప్లాట్ ఫామ్ గానూ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 38.8 కోట్ల మంది వినియోగదారులకు టెలికం సేవలను అందిస్తున్న జియో ఇన్ఫోకామ్, ఈ డీల్ తరువాత కూడా జియో ప్లాట్ ఫామ్ అనుబంధ సంస్థగానే కొనసాగుతుందని రిలయన్స్ స్పష్టం చేసింది.

ఈ డీల్ తో భారత్ లో వాణిజ్యం, ముఖ్యంగా సూక్ష్మ చిన్న తరహా వ్యాపారులకు, రైతులకు మేలు కలుగుతుందని ఈ సందర్భంగా జియో అభిప్రాయపడింది. వినియోగదారులకు ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, స్మార్ట్ డివైజ్ లు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), బ్లాక్ చెయిన్, అగుమెంటెడ్ అండ్ మిక్సెడ్ రియాల్టీ సేవలను మరింత దగ్గర చేయవచ్చని అభిప్రాయపడింది.

ఫేస్ బుక్ తో భాగస్వామ్యంపై స్పందించిన రిలయన్స్ సీఎండీ ముఖేష్ అంబానీ, "2016లో మేము జియోను ఆవిష్కరించిన వేళ 'డిజిటల్ సర్వోదయ' కలను కన్నాం. డిజిటల్ సేవలు విస్తరిస్తే, ప్రజా జీవనం మెరుగుపడుతుందని భావించాం. ఇండియాను డిజిటల్ ప్రపంచంలో ముందు నిలపాలని అనుకున్నాం. ఆ కల నిజమయ్యే రోజిది. ఫేస్ బుక్ ను సాదరంగా జియోలోకి స్వాగతిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ మదిలోని డిజిటల్ ఇండియా మిషన్ ఆలోచన కూడా త్వరగా లక్ష్యాన్ని అందుకుంటుంది. కరోనా తరువాత, ఇండియా ఆర్థిక వృద్ధి శరవేగంగా పెరుగుతుందని నేను నమ్మకంతో ఉన్నాను. ఈ రికవరీ అతి తక్కువ సమయంలోనే కళ్ల ముందు కనిపిస్తుంది" అని వ్యాఖ్యానించారు.

More Telugu News