Chennai: మూక దాడి నేపథ్యంలో స్వయంగా అంబులెన్స్ నడపుకుంటూ వెళ్లి.. సహచరుడ్ని ఖననం చేసిన చెన్నై డాక్టర్!

  • చెన్నైలో కరోనాతో కన్నుమూసిన డాక్టర్ సైమన్ హెర్క్యులస్
  • రెండు శ్మశానవాటికల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • అంబులెన్స్ సిబ్బందిపై దాడిచేసిన ప్రజలు
  • ఇద్దరు వార్డుబాయ్ లతో కలిసి మృతదేహాన్ని ఖననం చేసిన ఆర్థోపెడిక్ వైద్యుడు
Chennai doctor buried fellow doctor after mod attacked ambulance

గతంలో సినిమాల్లో చూసిన పరిస్థితులు ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వాస్తవిక ప్రపంచంలో అనుభవంలోకి వస్తున్నాయి. చెన్నైలో ఓ డాక్టర్ కరోనాతో మృతి చెందగా, ఎక్కడ ఆ వైరస్ తమకు అంటుకుంటుందోనని ప్రజలు ఆ డాక్టర్ అంత్యక్రియలను అడ్డుకున్నారు. ప్రజలు వైద్యసిబ్బందిపై దాడి చేయగా, ఓ డాక్టర్ ఎంతో సాహసోపేతంగా వ్యవహరించి తన సాటి డాక్టర్ మృతదేహాన్ని ఖననం చేయాల్సి రావడం దేశంలో నెలకొన్న అత్యంత దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది.

చెన్నైలో డాక్టర్ సైమన్ హెర్క్యులస్ కరోనా బారినపడి ఆదివారం రాత్రి కన్నుమూశాడు. ఆ వైద్యుడికి పేషెంట్ల ద్వారా కరోనా సంక్రమించినట్టు భావిస్తున్నారు. అయితే, ఆ డాక్టర్ మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది, చెన్నై కార్పొరేషన్ సిబ్బంది ప్రయత్నించగా, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కరోనాతో మరణించిన ఆ డాక్టర్ ను ఖననం చేస్తే ఆ వైరస్ మరింత ప్రబలుతుందని భయపడిన ప్రజానీకం వైద్య, కార్పొరేషన్ సిబ్బందిపై రాళ్లు, సీసాలు, కర్రలతో దాడికి దిగారు.

ఈ దాడిలో ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లకు తీవ్రగాయాలయ్యాయి. కార్పొరేషన్ సిబ్బంది కూడా గాయపడ్డారు. ఈ విధంగా రెండు శ్మశానవాటికల్లోనూ ఆ డాక్టర్ అంత్యక్రియలు నిర్వహించేందుకు అడ్డుపడ్డారు. పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో, డాక్టర్ కె.ప్రదీప్ కుమార్ అనే ఆర్థోపెడిక్ నిపుణుడు తన సహచర వైద్యుడి మృతదేహాన్ని ఖననం చేసేందుకు అత్యంత సాహసోపేతమైన రీతిలో ముందుకొచ్చారు. వెంటనే ఇద్దరు వార్డు బాయ్ లను తీసుకుని, అంబులెన్స్ ను స్వయంగా తానే నడపుకుంటూ వెళ్లారు.

అల్లరి మూకలను తప్పించుకుని మరో శ్మశానవాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఓ వార్డు బాయ్ కి పార ఇచ్చి, తాను మరో వార్డుబాయ్ తో కలిసి చేతులతోనే 10 అడుగుల గుంతను పూడ్చారు. ఇదంతా పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. చివర్లో ఓ పోలీసు సాయం అందించాడని డాక్టర్ ప్రదీప్ కుమార్ వెల్లడించారు. కాగా, ఈ వ్యవహారంలో చెన్నై పోలీసులు 21 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

More Telugu News