India: ఇండియాలో కరోనా మరణాల్లో రికార్డు... రికవరీల విషయంలో కూడా!

  • భారీగా పెరుగుతున్న వైరస్ పాజిటివ్ లు
  • ఒక్కరోజులో 47 మంది మృతి
  • అంతకన్నా వేగంగా పెరుగుతున్న రికవరీల సంఖ్య
  • తొలి ప్లాస్మా థెరపీ విజయవంతం
Improvement in Corona Recoveries in India

భారత ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, గడచిన 24 గంటల వ్యవధిలో ఇండియాలో 1,336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 47 మంది ఒక్క రోజులో మరణించారు. కరోనా తొలి మరణం వెలుగులోకి వచ్చిన తరువాత, ఇన్ని మృతులు ఒక్కరోజులో నమోదవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ 18,600 మందికి పైగా వ్యాధి బారిన పడగా, 590 మంది మరణించారు.

ఇక, ఈ విషయం ఆందోళనను పెంచుతున్నదే అయినా, ఇదే సమయంలో కరోనా సోకి రికవరీ అయిన వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉండటం, కొంత ఉపశమనాన్ని కలిగిస్తోందని వైద్య రంగంలోని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం రికవరీ రేటు 17.48 శాతానికి పెరిగింది. ఒక్కరోజులో 705 మంది కరోనా నుంచి పూర్తిగా బయటపడి డిశ్చార్జ్ అయ్యారు.

గత గురువారం నాడు 12.02 శాతంగా ఉన్న రికవరీ రేటు, శుక్రవారం నాటికి 13.06 శాతానికి, శనివారం నాడు 13.85 శాతానికి, ఆదివారం నాడు 14.19 శాతానికి, సోమవారం నాడు 14.75 శాతానికి పెరిగింది. మొత్తంమీద దేశవ్యాప్తంగా ఇంతవరకూ 3,200 మంది రికవర్ అయ్యారు. ఇక ఇదే సమయంలో కరోనా కేసుల రెట్టింపు సమయం పెరుగుతూ వస్తుండటం శుభ పరిణామమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణా చర్యల కారణంగానే, వైరస్ వ్యాప్తి తగ్గిందని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

కాగా, తాము నిర్వహించిన తొలి ప్లాస్మా చికిత్స విజయవంతం అయిందని, ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 49 సంవత్సరాల వ్యక్తికి.. కరోనా సోకి చికిత్స పొందిన తరువాత నెగటివ్ గా మారిన వ్యక్తి ప్లాస్మాను ఎక్కించామని, ఇప్పుడు రోగి కూడా రికవర్ అయ్యాడని, అతనికి సపోర్ట్ గా ఉంచిన వెంటిలేటర్ ను తొలగించామని అధికారులు తెలిపారు.

More Telugu News