BCCI: ఐపీఎల్ రద్దు భారం.. రూ. 5 వేల కోట్లు!

  • కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్
  • ఇన్సూరెన్స్ క్లాజు నుంచి మహమ్మారిని తొలగించిన బీమా సంస్థలు
  • బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల కొంప ముంచిన ఆలస్యం
BCCI IPL Franchises Set For 5000 Crore Loss

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కనుక రద్దైతే బీసీసీఐ, ఫ్రాంచైజీలకు రూ. 5 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. బీసీసీఐ సహా, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కరోనాకు వర్తించే బీమా లేకపోవడమే ఇందుకు కారణం.  బీసీసీఐ సంప్రదించే సమయానికే బీమా సంస్థలు తమ కవరేజ్ క్లాజ్ నుంచి కరోనాను తొలగించినట్టు హౌడెన్ అనే బీమా బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇది ఐపీఎల్ జట్లకు సంబంధించి ఇన్సూరెన్స్ డీల్స్ చూస్తుంది. బీమా సంస్థలు నిబంధనలు మార్చివేయడంతో కరోనా కారణంగా టోర్నీ రద్దైతే బీమా సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది.

నిజానికి ఫిబ్రవరి- మార్చి నెల మధ్యలో బీసీసీఐతోపాటు ఇతర ఫ్రాంచైజీలు బీమా కంపెనీని సంప్రదించాయి. అయితే, అప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. ఫలితంగా బీమా కంపెనీలు తమ క్లాజులను మార్చేశాయి. కరోనా కారణంగా టోర్నీలు రద్దైతే బీమా సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేకుండా సవరించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ జరగడం అనుమానంగానే ఉంది. రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఒకవేళ అదే జరిగితే బీసీసీఐతోపాటు ఫ్రాంచైజీలు కూడా నిండా మునగడం ఖాయమేనని అంటున్నారు. అయితే, వింబుల్డన్ వంటి టోర్నీల నిర్వాహకులు మాత్రం ముందుచూపుతో వ్యవహరించారు. మహమ్మారుల కారణంగా టోర్నీలు రద్దు అయినా బీమా వర్తించేలా ఇన్సూరెన్స్ చేయించారు. ఫలితంగా ఆయా టోర్నీల నిర్వాహకులు సేఫ్ అయ్యారు. 

More Telugu News