Mamata Banerjee: బెంగాల్ లో కరోనా పరిస్థితుల పరిశీలనకు సిద్ధమైన కేంద్రం....  అనుమతి నిరాకరించిన మమతా బెనర్జీ!

  • మరోసారి గుప్పుమన్న విభేదాలు
  • కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించిన మమతా
  • సూచనలు ఇస్తే స్వీకరిస్తామని వెల్లడి
CM Mamata Banarjee denies central teams for visiting in Bengal

కేంద్రానికి, మమతా బెనర్జీ నాయకత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మధ్య ఇప్పటికే తీవ్ర అంతరం ఏర్పడింది. చెప్పాలంటే మోదీ వర్సెస్ మమతా అనే స్థాయిలో యుద్ధం నడుస్తోంది. తాజాగా, ఆ విభేదాలు మరింత పెరిగేలా మమత కీలక నిర్ణయం తీసుకున్నారు.

పశ్చిమ బెంగాల్ లో కొవిడ్-19 పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్రం నుంచి ఆయా మంత్రిత్వ శాఖల బృందాలు పర్యటనకు సిద్ధమయ్యాయి. అయితే తమ రాష్ట్రంలో ఎవరూ పర్యటించనక్కర్లేదంటూ మమతా బెనర్జీ కేంద్ర బృందాలకు అనుమతి నిరాకరించారు. నిర్మాణాత్మక సలహాలు, సూచనలు చేస్తే అంగీకరిస్తాం తప్ప, ఇటువంటి పర్యటనలకు సమ్మతించబోమని తేల్చి చెప్పారు.

దేశంలో కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించిన కేంద్రం సమీక్షకు సన్నాహాలు చేస్తోంది. కేంద్రం గుర్తించిన ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, హౌరా, తూర్పు మిడ్నపూర్, ఉత్తర 24 పరగణాలు, డార్జిలింగ్, కలింపోంగ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే, పశ్చిమ బెంగాల్ లో ఏ ప్రాతిపదికన కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసిందో కేంద్రం చెప్పాలని మమత డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రం వైఖరిపై స్పష్టత లేదని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల ఎంపికలో ఏ విధానం పాటించారో గౌరవనీయ ప్రధాని, హోంమంత్రి అమిత్ షాలు వివరించాలని కోరారు. సరైన కారణాలు లేకుండా కేంద్ర బృందాలు వస్తున్నాయని, ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో 339 కరోనా కేసులు నమోదు కాగా, 12 మంది మరణించారు.

More Telugu News