Ganga: కరోనా మహిమ... దశాబ్దాల తర్వాత తాగటానికి యోగ్యంగా మారిన 'గంగ'!

  • లాక్ డౌన్ తో స్తంభించిన పరిశ్రమలు
  • గంగా తీరాల్లో ఉన్న క్షేత్రాలకు భక్తుల రాక నిలిచిపోయిన వైనం
  • స్వచ్ఛతను సంతరించుకున్న గంగా జలాలు
Water in Ganga river cleanup due to corona lock down

కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌన్ తో అనేక సత్ఫలితాలు వస్తున్నాయి. వైరస్ విస్తరణ కట్టడి అటుంచితే, పర్యావరణం ఎంతో లాభపడింది. వాతావరణ కాలుష్యం తగ్గడమే కాదు, నదీ జలాల్లో విషపూరిత పదార్థాల శాతం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా గంగా నదీ జలాలు ఇప్పుడు స్వచ్ఛతను సంతరించుకున్నాయి. నీటి అడుగున ఉన్న చేపలు కూడా కనిపించేంతగా గంగా నది పరిశుభ్రమైంది.

రిషికేశ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల వద్ద గంగా నది నీరు ఇన్నాళ్లకు తాగడానికి అనువుగా మారింది. ఒకప్పుడు గంగా నది చెత్తను పరిశుభ్రం చేయడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల ఖర్చుతో ప్రత్యేక పథకాలు చేపట్టాయి. అవేవీ చేయలేని కార్యాన్ని కరోనా చేసింది. లాక్ డౌన్ విధించడంతో ఈ క్షేత్రాలకు భక్తుల రాక నిలిచిపోయింది. ముఖ్యంగా, గంగా నదీ పరీవాహక ప్రాంతం పొడవునా విస్తరించిన పరిశ్రమల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాంతో ప్రమాదకర రసాయనాలు, వ్యర్థాలు నదిలో కలవడం బాగా తగ్గిపోయింది. ఈ కారణంగా గంగమ్మ పూర్వపు స్వచ్ఛతను అందిపుచ్చుకుంది.

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా హరిద్వార్ వద్ద గంగా నది నీటి పీహెచ్ శాతం అదుపులోకి వచ్చింది. తాజాగా ఇక్కడి నీటిని పర్యావరణ విభాగం 'క్లాస్ ఏ' విభాగంలో చేర్చింది. 'క్లాస్ ఏ' లో ఉండే నీటి పీహెచ్ శాతం 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. ప్రస్తుతం గంగా నదీ జలాల పీహెచ్ శాతం 7.4 గా ఉన్నట్టు పర్యావరణ విభాగం పేర్కొంది.

More Telugu News