కుక్కలు మీపై మొరుగుతున్నాయని నా మిత్రులు చెప్పారు: విజయసాయి వ్యాఖ్యలపై సుజనా ఫైర్

20-04-2020 Mon 15:36
  • కన్నాపైన, నాపైనా విజయసాయి అవాకులు, చెవాకులు పేలాడు
  • నేలబారు జీవుల మొరుగుడుని పట్టించుకోను
  • ఈ తెలివితేటలు కరోనా తరిమేయడంపై పెట్టండి
Sujana Chowdary fires on Vijayasai Reddy

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక వ్యక్తి నుంచి రూ. 20 కోట్లు తీసుకున్నారని... దానికి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి బ్రోకర్ గా వ్యవహరించారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారంలో వైసీపీ నేతలు కమిషన్లకు కక్కుర్తి పడ్డారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, విజయసాయి ఈ మేరకు స్పందించారు. ఈ వ్యాఖ్యలపై సుజనా చౌదరి అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.

నిన్న తన మిత్రులు తనకు ఫోన్ చేసి... కుక్కలు మీపై మళ్లీ మొరుగుతున్నాయని చెప్పారని సుజనా అన్నారు. ఏం జరిగిందోనని ఆరా తీస్తే... కన్నా గారిపై, నాపై విజయసాయి అవాకులు, చెవాకులు పేలాడని తెలిసిందని మండిపడ్డారు. ఇలాంటి నేలబారు జీవుల మొరుగుడుని తాను పట్టించుకోనని చెప్పారు. కరోనా కిట్ల కమిషన్లను దండుకోవడానికి కాకుండా, కరోనాను తరిమేయడానికి మీ తెలివితేటలను ఉపయోగిస్తే బాగుంటుందని విజయసాయికి హితవు పలికారు.