NIN: కరోనాపై పోరుకు శరీరాన్ని సిద్ధం చేయాలంటే... ఇవి తినాల్సిందే!

  • శరీరానికి మినరల్స్, విటమిన్స్ అందించాలి
  • పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి
  • ఉచిత రేషన్ కూడా పోషకాహారంతో నిండివుండాలి
  • కేంద్రానికి సూచించిన ఎన్ఐఎన్
Balenced Diet is Importent in these Days

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఎప్పుడు, ఎవరికి, ఎవరి నుంచి, ఎలా సోకుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ సమయంలో శరీరాన్ని కరోనా వైరస్ సోకినా, దానిపై పోరాడ గలిగేంత బలంగా తయారు చేసుకోవాలని, అందుకు సమతుల ఆహారాన్ని తీసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే ఏకైక మార్గమని పోషకరంగ నిపుణులు సూచిస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), ఎన్ఐఎన్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) నిపుణుల సూచనల ప్రకారం, పండ్లు, కూరగాయలు, వివిధ రకాల పిండి పదార్థాలు, నట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి, ఏవైనా ఇన్ఫెక్షన్లు ఇతరుల నుంచి సోకితే కాపాడుకునే శక్తి అధికమవుతుంది.

న్యూట్రిషన్ రీసెర్చ్ పై శతాబ్దానికి పైగా చరిత్రను కలిగిన ఎన్ఐఎన్, కరోనా వైరస్ పై పోరాడేందుకు శరీరాన్ని సిద్ధం చేసుకునే క్రమంలో భాగంగా చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన ఆహారంపై కొన్ని సూచనలు తయారు చేసి కేంద్రానికి పంపిందని సంస్థ డైరెక్టర్ ఆర్ హేమలత వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు, నిరుపేదలు, అనాధలు తదితరులకు పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాల్లో పోషక విలువలు అధికంగా ఉండేలా చూడాలని ఆమె సూచించారు.

మైక్రో న్యూట్రియంట్స్ (విటమిన్స్ మరియు మినరల్స్) అధికంగా తీసుకోవడం ద్వారా, ఒకే రకమైన వ్యాధి కారకాల నుంచి రీ ఇన్ఫెక్షన్ సోకడాన్ని నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. శరీరంలో విషపూరిత టాక్సిన్ లను తొలగించే శక్తిని కూడగట్టుకోవచ్చని అన్నారు. ఇదే సమయంలో వైరస్ ను హతమార్చేందుకు సహకరించే ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను అధికంగా శరీరం ఉత్పత్తి చేసుకుంటుందని కూడా తెలిపారు.

బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడి, నారింజ, నిమ్మకాయలు, బెర్రీ తదితర సీజనల్ ఫ్రూట్స్ తో పాటు ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, తాజా మాంసం, చేపలు తదితరాల్లో న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయని హేమలత గుర్తు చేశారు. రోజువారీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని, చెడు బ్యాక్టీరియాను అంతమొందిస్తూ, రోగ నిరోధక శక్తి హరించబడకుండా అది కాపాడుతుందని అన్నారు.

ఈ సమయంలో ప్రాసెస్డ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్, కార్బొనేటెడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండటమే మంచిదని చెప్పిన ఆమె, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది భావిస్తున్నట్టుగా మాంసం, గుడ్లు తినడం వల్ల కీడేమీ జరగబోదని స్పష్టం చేశారు. అయితే, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా మాంసం, గుడ్లు,  కూరగాయలను శుభ్రంగా కడిగిన తరువాతనే వాడుకోవాలని సూచించారు.

ఇక కొవ్వు పదార్థాలను రోజుకు 30 గ్రాముల కన్నా అధికంగా తీసుకోకుండా ఉంటే మంచిదని, ఉప్పును కూడా రోజుకు 5 గ్రాములకు పరిమితం చేయాలని, పంచదారను తీసుకోవడాన్ని కూడా నియంత్రించుకోవాలని అన్నారు. శరీరానికి కావాల్సినంత నీటిని అందించడం ద్వారా డీ హైడ్రేషన్ ను నివారించవచ్చని, నిత్యమూ యోగాను దినచర్యలో భాగం చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని ఆమె తెలియజేశారు.

మంచి అలవాట్లతోనే చాలా వరకూ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్న ఆమె, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు, రోజువారీ మందులను తీసుకుంటూనే డైట్ ను కొనసాగిస్తూ, వ్యాయామం తదితరాల ద్వారా ఒత్తిడికి దూరంగా ఉంటూ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని అన్నారు.

More Telugu News