Donald Trump: కరోనా టెస్టుల్లో ఇండియా సహా పది దేశాల కన్నా మేమే బెస్ట్!: ట్రంప్

  • పది దేశాల పేర్లను వెల్లడించిన ట్రంప్
  • అన్ని దేశాల్లో జరిగిన నమూనాల పరీక్షల కన్నా అమెరికాలో అధిక టెస్టింగ్
  • అతి త్వరలోనే యూఎస్ సురక్షితమవుతుందని వ్యాఖ్య
Trump Says US Tested More Than India and 9 Other Countries For Coronavirus

ఇండియా సహా మరో 9 దేశాల్లో ఇప్పటివరకూ జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల కన్నా, ఒక్క అమెరికాలోనే అత్యధిక పరీక్షలను జరిపించామని, ఇది ఓ రికార్డని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఆయన వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కరోనా మహమ్మారిపై జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఇంతవరకూ 41.8 లక్షల మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించామని అన్నారు. ప్రపంచంలోనే ఇది ఓ రికార్డని తెలిపారు.

"ఫ్రాన్స్, యూకే, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, ఇండియా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, స్వీడన్, కెనడా దేశాల్లో ఇప్పటివరకూ చేసిన అన్ని పరీక్షల కన్నా, అమెరికాలో చేసిన పరీక్షల సంఖ్య అధికం" అని ఆయన అన్నారు. కాగా, యూఎస్ లో సుమారు 8 లక్షల మందికి వైరస్ సోకగా, ఇప్పటివరకూ 40 వేల మందికి పైగా మరణాలు సంభవించాయి. కరోనా ప్రభావం అధికంగా ఉన్న న్యూయార్క్ నగరంలో 17,600 మంది మరణించగా, 2.42 లక్షల మందికి వ్యాధి సోకింది.

ప్రస్తుతం అమెరికాలోని సుమారు 33 కోట్ల మంది ప్రజల్లో 95 శాతానికి పైగా లాక్ డౌన్ ను పాటిస్తూ, ఇంటికే పరిమితం అయ్యారు. కరోనా కట్టడికి అమెరికా సరైన దారిలోనే నడుస్తోందని, కరోనాపై దూకుడుగానే వెళ్లాలన్న వ్యూహం ఫలిస్తోందని వ్యాఖ్యానించిన ట్రంప్, ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను కాపాడామని తెలిపారు. అతి త్వరలోనే దేశం పూర్తిగా సురక్షితమవుతుందని అభివర్ణించిన ఆయన, దేన్నీ మూసివేయకుండానే ఈ ఘనతను సాధిస్తామన్న నమ్మకం ఉందని అన్నారు.

More Telugu News