Tamilnadu: తమిళనాడులో ఇద్దరు జర్నలిస్టులకు సోకిన కరోనా!

Two Journalists Test Positive in Tamilnadu
  • ఓ దినపత్రిక విలేకరికి, న్యూస్ చానెల్ సబ్ ఎడిటర్ కు వైరస్
  • ఓ పోలీసు ఇన్ స్పెక్టర్ కు కూడా సోకిన మహమ్మారి
  • ఆసుపత్రులకు తరలించిన అధికారులు
తమిళనాడు రాష్ట్రంలో తొలిసారిగా ఇద్దరు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రావడంతో పాత్రికేయ వర్గాల్లో కలకలం రేగింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఓ తమిళ దినపత్రిక రిపోర్టర్ కు, మరో తమిళ న్యూస్ చానెల్ సబ్ ఎడిటర్ కు వైరస్ పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. రిపోర్టర్ ను రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు, సబ్ ఎడిటర్ ను గవర్నమెంట్ స్టాన్లీ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించామని, ప్రస్తుతం ఇద్దరి పరిస్థితీ నిలకడగానే ఉందని తెలిపారు.

ఇదిలావుండగా, అలందూరులోని పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న 52 ఏళ్ల సబ్ ఇన్ స్పెక్టర్ కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని ఆర్జీజీహెచ్ కి తరలించారు. ఈ ముగ్గురూ నివాసం వుండే ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ ను కట్టడి చేసే పనులను ప్రారంభించామని, ఇరుగు పొరుగు వారిని హెచ్చరించామని, వారిని ఇల్లు కదలకుండా చూస్తున్నామని తెలిపారు. ఇక వీరితో కాంటాక్ట్ అయిన ఉద్యోగులను, మిత్రులను, వారు తిరిగిన ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు వెల్లడించారు. కాగా, తమిళనాడులో తొలి కరోనా కేసు మార్చి 8న నమోదైంది.
Tamilnadu
Journalists
Corona Virus
Positive

More Telugu News