Tirumala: భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం మరింత ఆలస్యం?

  • సప్తగిరులపై స్వయంభువుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి
  • ప్రస్తుతానికి మే 3 వరకూ దర్శనాలు బంద్
  • ఆపై పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్న టీటీడీ
tirumala Lockdown May Extened after May 4

సప్తగిరులపై స్వయంభువుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు మరింతగా వేచి చూడక తప్పదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, గత నెల 20న తొలుత వారం రోజుల పాటు, ఆపై ఏప్రిల్ 14 వరకూ, దాని తరువాత మే 3 వరకూ దర్శనాలను నిలిపివేయాలని నిర్ణయించిన తిరుమల తిరుపతి దేవస్థానం, ఇప్పుడు మే 4 నుంచి కూడా దర్శనం కల్పించడం కష్టమే అవుతుందన్న అంచనాలో ఉంది. 3వ తేదీ తరువాత పరిస్థితిని సమీక్షించి, కేంద్రం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా దర్శనాలపై ఓ ప్రకటన చేస్తామని అధికారులు వెల్లడించారు.

శ్రీనివాసుడి దర్శనార్ధం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. స్వామివారి దర్శనార్ధం వచ్చే భక్తులలో ఎవరికైనా వైరస్ సోకితే, ఇక్కడి రద్దీ కారణంగా అది ఇతరులకు సులభంగా వ్యాపించే అవకాశం ఉండటంతో దర్శనాల రద్దును మరిన్ని రోజుల పాటు పొడిగించాలన్న ఆలోచనలో టీటీడీ ఉంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, ప్రస్తుతానికి తిరుమలలో విధులు నిర్వహించే అధికారులు, పూజాది కైంకర్యాలు జరిపించే అర్చకులు మినహా మరెవరికీ కొండపైకి ప్రవేశం లేదు.

ఆలయంలోకి భక్తులకు అనుమతి లేకున్నా, స్వామివారికి జరిగే అన్ని కైంకర్యాలనూ వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం జరిపిస్తున్నామని అర్చకులు అంటున్నారు. ఆలయాన్ని తెల్లవారుజామున 3 గంటలకే సుప్రభాత సేవతో తెరుస్తున్నామని, రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ అనంతరం ఆలయాన్ని మూసివేస్తున్నామని వెల్లడించారు. కల్యాణ, వసంతోత్సవ తదితర సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

More Telugu News