Foreigners: డబ్బులు అయిపోవడంతో గుహలో కాలం వెళ్లబుచ్చుతున్న విదేశీయులు... క్వారంటైన్ కు తరలింపు

  • లాక్ డౌన్ తో భారత్ లో చిక్కుకుపోయిన విదేశీయులు
  • రిషికేశ్ లో ఆరుగురు విదేశీయులకు క్వారంటైన్
  • వారిలో కరోనా లక్షణాలు లేవన్న పోలీసులు
Police send foreigners to quarantine who sheltered in a cave

కరోనా వైరస్ ప్రభావంతో కేంద్రం లాక్ డౌన్ విధించడంతో అనేకమంది విదేశీయులు కూడా ఇబ్బందులపాలవుతున్నారు. ప్రముఖ పుణ్యకేత్రం రిషికేశ్ లో ఉన్న బీటిల్స్ ఆశ్రమానికి వచ్చిన ఆరుగురు విదేశీయులు కూడా లాక్ డౌన్ తో అవస్థలకు గురయ్యారు. వారివద్ద ఉన్న డబ్బులు అయిపోగా, అక్కడే ఉన్న ఓ గుహలో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఆ విదేశీయుల పరిస్థితి తెలుసుకున్న పోలీసులు, వారందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

ప్రస్తుతం వారు స్వర్గ్ ఆశ్రమంలో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో ఉన్నారని, వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని పోలీసులు తెలిపారు. వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వారంతా ఫ్రాన్స్, అమెరికా, టర్కీ, నేపాల్, ఉక్రెయిన్ దేశాలకు చెందినవారు. మార్చి 24 నుంచి ఆ గుహలోనే ఉంటున్నట్టు గుర్తించారు. లాక్ డౌన్ కు ముందు వాళ్లు మునీ కే రేతీ ప్రాంతంలోని ఓ హోటల్ లో ఉన్నారు. తమ వద్ద ఉన్న నగదులో అధికభాగం అయిపోవడంతో ఆశ్రమం సమీపంలోని గుహలో తలదాచుకున్నారు. అయితే, ఆహార పదార్థాలు కొనుక్కునేందుకు మాత్రం కొంత డబ్బు దాచుకున్నారని పోలీసులు వివరించారు.

More Telugu News