Love Agarwal: ఈ నెల 20 తర్వాత కూడా కంటైన్ మెంట్ జోన్లలో ఎలాంటి మినహాంయిపులు ఉండబోవు: లవ్ అగర్వాల్

Lover Agarwal Press meet
  • ఆ జోన్లలో మే 3 వరకూ  షాపింగ్ కాంప్లెక్స్ లు  తెరచుకోవు
  • దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 15,712
  • ‘కరోనా’ నివారణా వ్యాక్సిన్ అభివృద్ధికి చర్యలు ముమ్మరం  
ఈ నెల 20 తర్వాత కూడా ‘కరోనా ’హాట్ స్పాట్స్ లోని కంటైన్ మెంట్ జోన్లలో ఎలాంటి మినహాంయిపులు ఉండబోవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్  తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ జోన్లలో సినిమా హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లు, ప్రార్థనా మందిరాలు మే 3 వరకూ తెరచుకోవని స్పష్టం చేశారు. ‘కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కొన్ని రకాల మినహాయింపులు ఉంటాయని అన్నారు.

గడచిన 28 రోజుల్లో పుదుచ్చేరిలోని మహి, కర్ణాటకలోని కొడగులో కొత్తగా ‘కరోనా’ కేసులు నమోదు కాలేదని చెప్పారు. గడచిన పద్నాలుగు రోజుల్లో మరో 54 జిల్లాల్లో కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. ‘కరోనా’ బాధితులను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న  వైద్య బృందాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించాలని సూచించారు. ‘కరోనా’ నివారణ వ్యాక్సిన్ అభివృద్ధికి చర్యలు ముమ్మరం చేశామని, ఇందుకు సంబంధించిన అభివృద్ధి పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. నిబంధనల ప్రకారమే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని తెలిపారు.

గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,334 అని, 27 మంది మృతి చెందారని చెప్పారు. దీంతో, దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 15,712కి చేరిందని అన్నారు. ఇప్పటి వరకే ‘కరోనా‘ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 2,231 మంది కాగా, 507 మంది మృతి చెందారు.
Love Agarwal
central medical and health
joint secretary

More Telugu News